భద్రకాళి ఆలయం.. భక్త జనసంద్రం .. కొనసాగుతున్న శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు

భద్రకాళి ఆలయం.. భక్త జనసంద్రం .. కొనసాగుతున్న శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు
  • ఈ నెల 10న ముగియనున్న ఉత్సవాలు
  • రేపు శాకాంబరీగా దర్శనమివ్వనున్న అమ్మవారు 
  • కూరగాయల బుట్టలతో ర్యాలీగా తరలొచ్చిన మహిళలు

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలొస్తున్నారు. దశాబ్దాలుగా ఏటా ఆషాఢమాసంలో 15 రోజుల పాటు నిర్వహించే శాకాంబరీ నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గత నెల 26న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవగా, ఈ నెల 10న ముగియనున్నాయి. చివరిరోజు అమ్మవారు శాకాంబరీ (కూరగాయలు) అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు.

15 రోజులు.. రోజూ రెండు అవతారాలు

శాకాంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారు 15 రోజుల పాటు రోజూ రెండు అవతారాల్లో దర్శనమిస్తారు. దీనికోసం ఉదయం, సాయంత్ర వేళల్లో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు నిర్వహిస్తారు. మంగళవారం మాత్రాక్రమం, సర్వమంగళాక్రమం అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. నేడు ముద్రాక్రమం, జ్వాలమాలినీక్రమంలో దర్శనమివ్వనుండగా, చివరిరోజు శాకాంబరీగా అమ్మవారు భక్తుల పూజలు అందుకోనున్నారు. 

టన్నులకొద్ది కూరగాయలు 

ఆషాఢమాస నవరాత్రి ఉత్సవాల ముగింపు ఘట్టంగా భావించే శాకాంబరీ అలంకరణకు రెండ్రోజుల ముందునుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. గురువారం అమ్మవారు శాకాంబరీ అలంకరణలో దర్శనమివ్వనుండగా, అలంకరణకు అవసరమయ్యే టన్నులకొద్ది వివిధ రకాల కూరగాయలు మంగళవారమే ఆలయానికి చేరుకున్నాయి. లక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో వేలాదిమంది మహిళలు ఉదయమే ఆలయం నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండే వరంగల్‍ ఓసిటీ ప్రాంతం నుంచి ఏకరూప దుస్తుల్లో బుట్టల్లో భారీ ర్యాలీగా కూరగాయలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

వీఐపీల దర్శనాలతో అసలు రచ్చ 

శాకాంబరీ ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గంటలకొద్దీ క్యూలో నిలబడగా, ఆలయంలో పనిచేసే కొందరు సిబ్బంది వీఐపీలు, వీవీఐపీల దర్శనం పేరుతో చేసే హడవుడి మిగతావారికి ఇబ్బందిగా మారుతోంది. లీడర్లు, అర్చకులు, ఆలయ సిబ్బంది ఎవరికివారుగా తమకు నచ్చినవారిని వీఐపీ పేరుతో ప్రత్యేక దర్శనం చేయించేందుకు పోటీ పడుతుండటం ఏటా విమర్శలు వస్తున్నాయి. ఈసారి ధర్మకర్తల మండలి ఏర్పాటుతో ఇలాంటివాటికి చెక్‍ పెడతారా లేదా అని చూడాలి.