Sarfaraz Khan: ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్ ఎంపిక కాలేదు.. గంభీర్ తీరుపై కాంగ్రెస్ మహిళా నేత ఘాటు వ్యాఖ్యలు

Sarfaraz Khan: ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్ ఎంపిక కాలేదు.. గంభీర్ తీరుపై కాంగ్రెస్ మహిళా నేత ఘాటు వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసినందుకు సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ నాయకురాలు షమా మొహమ్మద్.. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె మరోసారి టీమిండియా యంగ్ క్రికెటర్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన ఇండియా ఏ స్క్వాడ్ లోనూ సర్ఫరాజ్ కు స్క్వాడ్ లో ఎంపిక చేయలేదు. దీంతో కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి షామా మొహమ్మద్ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరును విమర్శించింది. 

గంభీర్ మతపరమైన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. "సర్ఫరాజ్ ఖాన్ ఇంటిపేరు కారణంగా ఎంపిక కాలేదా! #justasking. ఈ విషయంలో గౌతమ్ గంభీర్ వైఖరి ఏమిటో మాకు తెలుసు" అని మొహమ్మద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గతంలో ఆమె మాజీ  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నారని.. టీమిండియాలో ఇప్పటి వరకు ఉన్న అందరి కెప్టెన్లలో.. ఆకట్టుకోని విధంగా ఉన్నది ఒక్క రోహిత్ శర్మనే అంటూ తన అకౌంట్ నుంచి పోస్టులు పెట్టారు మాజీ జర్నలిస్ట్, కాంగ్రెస్ మహిళా నేత షామీ మొహమ్మద్.

ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. రంజాన్ మాసంలో షమీ జ్యూస్ తాగుతూ కనిపించడంతో ఉపవాసం (రోజా) లేకుండా షమీ పాపం చేసాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ బరేల్వి అన్నారు. అతని వ్యాఖ్యలను ఖండిస్తూ షమా మహమ్మద్ షమీకి సపోర్ట్ గా నిలిచింది. 

సర్ఫరాజ్ విషయానికి వస్తే తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XIతో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. దీనికి తోడు గాయం కారణంగా 2024-25 రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత కష్టపడి బరువు తగ్గినప్పటికీ ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సర్ఫరాజ్ కు ఛాన్స్ దక్కలేదు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోనూ నిరాశే మిగిలింది.    

2024 ఫిబ్రవరి 15 రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. ఓవరాల్ గా ఆరు టెస్టుల్లో ఇండియా తరపున 371 పరుగులు చేశాడు.