బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్సిటీ (పీఈఎస్)లో ఓ ప్రొఫెసర్.. ముస్లిం స్టూడెంట్ను ‘టెర్రరిస్ట్’ అంటూ తిట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. మంగళవారం క్లాస్ జరుగుతుండగా.. అఫాన్ అనే స్టూడెంట్ఒకరిని కలవడానికి బయటకు వెళ్లేందుకు ప్రొఫెసర్ పర్మిషన్ అడిగాడు. దాంతో ఆగ్రహించిన ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్ దేశ్‌పాండే.. క్లాస్‌రూమ్‌లో ఆ విద్యార్థిపై విరుచుకుపడ్డాడు.
‘‘సిగ్గు లేదా.. ఇరాన్ యుద్ధానికి నీలాంటి వాళ్లే కారణం. ట్రంప్ వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు నరకానికి పోతావు” అని అరుస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఉదంతాన్ని క్లాస్‌లోని మరో విద్యార్థి తన మొబైల్‌లో రికార్డ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ.. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తూ వైస్ చాన్స్‌లర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, బాధిత విద్యార్థికి మద్దతుగా నిలిచిన మరో ముగ్గురు విద్యార్థులను కూడా సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
