
బషీర్ బాగ్, వెలుగు : భువనగిరి బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ కోరారు. ఈ విషయమై ఇప్పటికే బీఆర్ఎస్అధినేత కేసీఆర్ ను కోరినట్లు చెప్పారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చిందని ఆరోపించారు. తనకు బీఆర్ఎస్తోపాటు ఏ పార్టీ టికెట్ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
కనీసం తనపై అభ్యర్థులను ప్రకటించకుండా మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవమన్నారు. శుక్రవారం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద శ్రీకాంతచారి ఫొటోకు ఆమె నివాళులర్పించారు. బీఆర్ఎస్పదేండ్ల పాలనలో అమరుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన బిడ్డతోపాటు వెయ్యి మంది ఉద్యమంలో అమరులయ్యారని.. వారి కుటుంబ సభ్యులకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఉద్యమంలో పాల్గొననివారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారని.. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అమరవీరుల కుటుంబాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నర్సింహరావు, నర్సింహచారి, శివ వాస్తల్య, వీరాచారి, వెంకటాచారి, వసంత, సునంద తదితరులు పాల్గొన్నారు.