సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడి వద్ద శనివారం జరిగిన లాఠీచార్జి నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఏ ఒక్కరిని గుడి ప్రాంతంలోకి అనుమతించడం లేదు. ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించాలని నాయకులు నిర్ణయించినప్పటికీ గుడి ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. ఆదివారం ఆలయంలో జోగినులు శాంతిహోమం నిర్వహించారు.
గుడి అభివృద్ధికి ప్రభుత్వం రూ. పది లక్షలు ఇచ్చిందంటూ కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ముత్యాలమ్మ దేవాలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదివారం దేవాలయ ప్రాంగణంలో నిర్వాహకులు సంతోష్, కిరణ్, సాయి ప్రకాశ్, కిషన్, ఎల్లిస్, వైష్ణవి, సోను మాట్లాడుతూ.. 19న ఎమ్మెల్యే సూచన మేరకు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే గణేష్, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశామన్నారు. గుడి పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే రూ. 10 లక్షలు, ప్రభుత్వం తరఫున మరో రూ.10 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. విషయాన్ని బస్తీవాసుల ముందే చెప్పాలని, అందరి సమక్షంలోనే నిర్ణయం తీసుకుంటామని తాము మంత్రికి విన్నవించామన్నారు.