బేగంపేట, యాకుత్​పురా.. రైల్వే స్టేషన్ల రూపు మారనుంది

బేగంపేట, యాకుత్​పురా.. రైల్వే స్టేషన్ల రూపు మారనుంది
  • అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక 
  • రెండింటికీ కలిపి రూ.31.1 కోట్ల నిధులు విడుదల

సికింద్రాబాద్, వెలుగు:  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను ఎయిర్​పోర్టు తరహాలో తీర్చిదిద్దుతున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా బేగంపేట, యాకుత్​పురా స్టేషన్లను డెవలప్​చేసేందుకు రెడీ అయింది. అమృత్​భారత్ స్టేషన్​స్కీమ్​కింద ఈ రెండు స్టేషన్లను అభివృద్ధి చేయనుంది. ఈ స్కీములో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్​గా 554  రైల్వే స్టేషన్లు, 1,500 ఆర్ఓబీ, ఆర్​యూబీల పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. అమృత్​భారత్ స్టేషన్​స్కీములో దేశ వ్యాప్తంగా 554 స్టేషన్లు ఎంపిక కాగా, మొదటి దశలో బేగంపేట, యాకుత్​పురా స్టేషన్లు చోటు దక్కించుకున్నాయి. బేగంపేట స్టేషన్​కు రూ.22.57 కోట్లు, యాకుత్​పురాకు స్టేషన్​కు రూ.8.53 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది.

చేసే పనులు ఇవే.. 

అభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్లలో కొత్త బిల్డింగులు నిర్మించనున్నారు. సరికొత్తగా ఎంట్రెన్స్, వెయిటింగ్ హాళ్లు, ఈజీగా అర్థమయ్యేలా సైన్​బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. టికెట్​బుకింగ్ కౌంటర్లను మాడిఫై చేయనున్నారు. స్టేషన్​పరిసరాల్లో రోడ్ల విస్తరణ, వాకింగ్​ట్రాక్, పార్కింగ్, స్పెషల్​లైటింగ్ ఏర్పాటు చేస్తారు. స్టేషన్ ఆవరణలో స్థానిక కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పెయింటింగులు, మోడ్రన్ స్టాళ్లు, స్టేషన్​కు ఇరువైపులా రెండు ఎంట్రన్స్​లు, ప్లాట్​ఫాంలను అభివృద్ధి చేయనున్నారు. కొత్తగా ప్లాట్ ఫాంలపై షెల్టర్ల నిర్మాణం, మోడ్రన్​అడ్వర్టైజింగ్​సిస్టమ్, ఎల్ఈడీ సైన్​బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

ఈ స్టేషన్లనే ఎందుకంటే..

బేగంపేట, యాకుత్​పురా స్టేషన్లు చాలా పాతవి. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్ల నుంచి జర్నీ చేసే ప్రయాణికులు భారీగా పెరిగారు. ప్రధాన రైళ్లు ఈ  స్టేషన్లలో ఆగుతుండడం ప్రయాణికులకు ఇటుగా జర్నీ చేయడం ఈజీగా ఉంది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద మొదటి విడతలో ఎంపిక చేసింది.