మద్యం మత్తులో గేటు ఎక్కితే..చేతిలో దిగబడిన ఇనుప చువ్వ

మద్యం మత్తులో గేటు ఎక్కితే..చేతిలో దిగబడిన ఇనుప చువ్వ
  •     చువ్వతోనే  దవాఖానకు..
  •     సర్జరీ చేసి తీసేసిన డాక్టర్లు 

కుత్బుల్లాపూర్​, వెలుగు:  షార్ట్​కట్​లో వెళ్దామని  గేటు దూకే ప్రయత్నం చేయడంతో  కాలుజారి ఒక యువకుడి కుడిచేతి మణికట్టులో ఇనుప చువ్వ దిగింది. ఆ చువ్వ నుంచి చేయి రాకపోవడంతో చువ్వను కట్​చేసి దవాఖానకు తరలించి సర్జరీ చేసి తీసెయ్యాల్సి వచ్చింది. ఏపీకి చెందిన మణికంఠ(32) షాపూర్​నగర్​లోని ఓ హాస్టల్​లో ఉంటూ కాంట్రాక్టర్​లేబర్. సోమవారం ఉదయం తన మిత్రులతో కలిసి హాస్టల్​నుంచి షాపూర్​నగర్​ మెయిన్​రోడ్డువైపు వచ్చాడు. తిరిగి హాస్టల్​కు వెళ్లే క్రమంలో దూరమవుతుందని షార్ట్​కట్​గా ఎంజే గార్డెన్​ వద్ద ఉన్న భారీ ఇనుప గేటును దూకి వెళ్లే  ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో కాలు జారి గేటుకు ఉన్న పదునైన ఇనుప కడ్డీ కుడిచేతి మణికట్టు లోపలికి దిగింది. తీవ్ర రక్తస్రావం, బాధతో విలవిలలాడుతుండగా స్థానికులు 108 కు సమాచారం ఇచ్చారు. 

సిబ్బంది నరేందర్​రెడ్డి, శ్రీనివాస్​మణికట్టులోకి దిగిన ఇనుప చువ్వను తీసేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. గంట పాటు శ్రమించి చువ్వను కట్​చేసి ఆ ముక్కతోనే మణికంఠను దవాఖానకు తరలించారు. తర్వాత సర్జరీ చేసి తొలగించారు. కాగా, షాపూర్​నగర్​లోని ఓ కల్లుదుకాణం వద్ద మద్యంసేవించిన మణికంఠ ఆ మత్తులో గేటు ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.