నన్ను రిటైర్ అవ్వమని చెప్పడానికి ఆయన ఎవరు..? : శరద్ పవార్

నన్ను రిటైర్ అవ్వమని చెప్పడానికి ఆయన ఎవరు..? : శరద్ పవార్

మహారాష్ట్ర పాలిటిక్స్‌ రసవత్తరంగా మారాయి. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలపై శరద్ పవార్ మరోసారి స్పందించారు. తాను అలసిపోనని, రిటైర్ కానని.. కార్యకర్తలు తనను పని చేయాలని కోరుకుంటున్నారని అజిత్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘‘మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా..? నాకు ప్రధానమంత్రి లేదా మంత్రి కావాలని లేదు. కానీ, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను’’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

తనకు పనిచేసే శక్తి ఉందని చెప్పుకొచ్చారు శరద్ పవార్. ‘‘నేను అలసిపోను... రిటైర్ కూడా కాను’’.. అని అటల్ బిహారీ వాజపేయి మాటలను పవార్ గుర్తు చేశారు. తనను రిటైర్ కావాలని చెప్పడానికి అజిత్ ఎవరు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శరద్‌ పవార్‌ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. నాసిక్ జిల్లాలోని యోలా నుంచి ర్యాలీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అజిత్ పవార్ వ్యాఖ్యలపై  నాసిక్‌లో శరద్ పవార్‌ మాట్లాడారు. కొంతమందిని నమ్మి తాను తప్పు చేశానని, ఆ తప్పును మరోసారి పునరావృతం చేయనన్నారు. ఎవరిని నమ్మకూడదని అజిత్ పవార్‌ను ఉద్దేశించి శరద్ పవార్ వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి షాకిస్తూ అజిత్‌ పవార్‌.. షిండే వర్గంలో చేరడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. షిండే సర్కార్‌ అజిత్‌ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన విషయం తెలిసిందే.