ఢిల్లీ లిక్కర్ స్కాం : శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుకు మరో 4 రోజులు ఈడీ కస్టడీ 

ఢిల్లీ లిక్కర్ స్కాం  : శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుకు మరో 4 రోజులు ఈడీ కస్టడీ 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులకు ఈడీ కస్టడీ గడువును మరో నాలుగు రోజులకు పొడిగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. శరత్ చంద్రా రెడ్డి, వినయ్ బాబు ఇన్వెస్టిగేషన్ కి సహకరించట్లేదని, మరో వారంపాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ వాదనలు వినిపించింది. విచారణ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ తరపు లాయర్ వెల్లడించారు.

బుచ్చి బాబు, అరుణ్ పిళ్లైలను కూడా విచారించాల్సిన అవసరం ఉందని.. రేపు విచారణకు రావాలని వారికి సమన్లు ఇచ్చామని కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేసులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని.. ఈ సమయంలో ఇద్దరికీ బెయిల్ ఇస్తే వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.

శరత్ చంద్రారెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ..  ‘‘కస్టడీలో ఎలాంటి విషయాలు ఈడీకి దొరకలేదు. కావలసిన సమాచారం మొత్తం ఈడీకి ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి చెప్పారు.  హైదరాబాద్ లోని శరత్ కార్యాలయంలో సోదాలు నిర్వహించినా ఏమీ దొరకలేదు.శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీ ఉద్యోగులను కూడా ఈడీ అధికారులు వేధిస్తున్నారు. రెండ్రోజులు మాత్రమే ఈడీ కస్టడీని పొడిగించాలి’’ అని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి 4 రోజుల కస్టడీ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

మరోవైపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు జ్యుడీషియల్ కస్టడీ గడువును కూడా పెంచారు. ఈ నెల 26వరకు ఆయన కస్టడీని పెంచిన సీబీఐ స్పెషల్ కోర్ట్.. రేపు, ఎల్లుండి జైలులో సమీర్ మహేంద్రుని విచారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది.