
పేపర్ లీక్‌లో నీ దోస్తులున్నరనే.. నాకేం సంబంధం అంటున్నవా?
కేటీఆర్‌పై షర్మిల ఫైర్
హైదరాబాద్, వెలుగు: పేపర్ లీక్ బయటపడే సరికి మంత్రి కేటీఆర్.. తనకేం సంబంధం లేదని ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. నిన్నమొన్నటిదాకా టీఎస్ పీఎస్సీ ద్వారా లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘‘నీ వాటా, నీ కోటా, నీ హస్తం, నీ దోస్తులు ఉన్నారని తెలిసేసరికి.. టీఎస్ పీఎస్సీ అక్రమం అయిపోయిందా? స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలు సర్కారు పరిధిలో ఉండవని బొంకుతున్నావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీ అధీనంలో లేకపోతే.. సభ్యులను నియమించినందుకు హైకోర్టుకు ఎందుకు సంజాయిషీ ఇచ్చావ్? నీది కాని శాఖల మంత్రులతో నువ్వెందుకు రివ్యూలు చేస్తున్నవ్?’’ అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ స్వతంత్ర వ్యవస్థ అని చెప్పుకుంటనే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణ చేయిస్తే నిజాలు బయటపడ్తాయన్నారు.