
- కేసీఆర్‌పై షర్మిల ఫైర్
- సీఎం సభకు లేని రూల్స్.. అంబేద్కర్ జయంతికి ఎందుకని ప్రశ్న
‘‘తెలంగాణ వచ్చినంక దళితుణ్ని సీఎం చేస్తానని కేసీఆర్ దొర దగా చేసిండు. దళితుణ్ని సీఎం చేయాలని దళితులు అడగలే. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దళితులను ఉపయోగించుకుంటున్రు” అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కు నివాళి అర్పించి ఆమె మాట్లాడారు. నాగార్జునసాగర్ లో సీఎం సభకు లేని కరోనా రూల్స్.. అంబేద్కర్ జయంతికి ఎందుకని ప్రశ్నించారు. దీన్ని బట్టే సీఎం కేసీఆర్ కు దళితులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఆరోపణలు రాగానే అప్పట్లో రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన కేసీఆర్.. మంత్రి మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కేబినెట్ లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. దళితుడనే కారణంతోనే రాజయ్యను తొలగించారని ఆరోపించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి ఐదేండ్లయినా పనులు ఎందుకు మొదలుపెట్టలేదని నిలదీశారు. రిజర్వేషన్ల పెంపు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం పేరు పెట్టారని.. దానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఏపూరి సోమన్న, ఇందిరా శోభన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల కోసం ఇయ్యాల షర్మిల దీక్ష..ఒక్కరోజు చేసేందుకే పోలీసుల పర్మిషన్
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేయనున్నారు. ఆమె ఒక్కరోజే దీక్ష చేపట్టేందుకు పోలీసులు బుధవారం పర్మిషన్ ఇచ్చారు. కరోనా కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దీక్షకు అనుమతి ఇచ్చారు. కాగా, తాను 72 గంటల పాటు దీక్ష చేస్తానని ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ప్రకటించారు. సీఎం కేసీఆర్ సభకు వర్తించని కరోనా రూల్స్.. తమ దీక్షకు ఎలా వర్తిస్తాయని షర్మిల అనుచరులు ఇందిరా శోభన్, పిట్టా రాంరెడ్డి ప్రశ్నించారు. ఈ దీక్షకు తాము ఎవరినీ పిలవలేదని చెప్పారు. కాగా, ఖమ్మం జిల్లా పాతర్లపాడు ఎంపీటీసీ సరస్వతి, ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్ రమేశ్... షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.