జనం డబ్బుతో గడీలు, కోటలు

జనం డబ్బుతో గడీలు, కోటలు

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​కు దేశ రాజకీయాలపై ఉన్న ఆసక్తి తెలంగాణ రైతులపై లేదని వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎగ్గొట్టడం కేసీఆర్​కు అలవాటుగా మారిందన్నారు. పది రోజుల్లో పరిహారం ఇస్తా నని, నెల రోజులైనా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ సంపదనంతా కొల్లగొట్టి హైదరాబాద్​లో గడీలు, ఢిల్లీలో కోటలు కడుతున్నారని షర్మిల గురువారం ట్విట్టర్​లో మండిపడ్డారు. అకాల వర్షాలకు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా.. కేసీఆర్​కు చీమకుట్టినట్టైనా లేదన్నారు. పంట నష్టపోయిన వారిలో సగం మంది కౌలు రైతులున్నారని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  రైతులు కన్నీరు పెడుతుంటే కల్లాల్లో ఉండాల్సిన సీఎం.. దేశాన్ని దోచుకోవడానికి ఢిల్లీకి పోయిండని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని షర్మిల డిమాండ్​ చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్​పై ఫిర్యాదు చేసేందుకు షర్మిల శుక్రవారం బేగంబజార్ పీఎస్ కు వెళ్లనున్నట్లు పార్టీవర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. 

ఏది కట్టినా మునుగుడు.. ఉరుసుడే

సెక్రటేరియెట్​నిర్మాణ ఖర్చుపై వైట్​పేపర్ రిలీజ్​ చేయాలని షర్మిల డిమాండ్​ చేశారు. రూ.1,600 కోట్లు ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పాలన్నారు. పొలిటికల్ సైన్స్ చదివానని చెప్పుకునే కేసీఆర్​ఏది కట్టినా  మహాద్భుతమేనని షర్మిల ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కడితే ఒక్క వరదకే మునిగిందని, యాదాద్రి కడితే చిన్నవానకే ఆగమైందని అన్నారు. సెక్రటేరియెట్ ​గోడలు అప్పుడే బీటలు వారాయని, చిన్న జల్లుకే నీళ్లు ఎత్తిపోస్తున్నారని విమర్శించారు. ఇక పరీక్షలు పెడితే.. పేపర్ లీకులు, సర్కారుకు లింకులు బయటపడ్డాయన్నారు.