కేసీఆర్ రైతులను మోసం చేశారు

కేసీఆర్ రైతులను మోసం చేశారు

యాసంగిలో వరి వేసుకుంటే ఉరి అని చెప్పి రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఫలితంగా తెలంగాణలో 17 లక్షల ఎకరాలను రైతులు పడావు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతుల రుణమాఫీ చేస్తామని నమ్మబలికి..గెలిచిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని ప్రశ్నించారు. నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని మండిపడ్డారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు. ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో దాదాపు రెండు లక్షలకుపైగా ఉద్యోగాలు ఉన్నా..వాటిని భర్తీ చేయడం లేదన్నారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారు కూలి పనులు చేసుకుంటున్నారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పా..పేదలను మోసం చేశారన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్ళీ దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చిన పట్టా భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి రైతులకు బ్రతుకే లేని తెలంగాణ గా చేస్తారా అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం