ఏప్రిల్ 26న షర్మిల దీక్ష

ఏప్రిల్ 26న షర్మిల దీక్ష

 

హైదరాబాద్, వెలుగు: వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు పది రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వైఎస్సార్ర్​టీపీ  చీఫ్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ మాటలు, హామీల పరిస్థితి ఏంటి అనేది మరోసారి తేలిపోయిందని శనివారం ట్వీట్​ చేశారు. తొలుత 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పి చివరకు 1.51  లక్షల ఎకరాలుగా చెప్తూ రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. రాష్ట్ర రైతులను ఆదుకునే సోయి లేదు కానీ కిసాన్ సర్కారు అంటూ పక్క రాష్ట్రాల్లో దొంగ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నష్టపోయిన ప్రతి ఎకరా వరి పంటకు రూ.25వేలు, మిర్చి, మొక్కజొన్న పంటకు రూ.50వేలు, మామిడికి రూ.75 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ నెల 26న దీక్ష

టీసేవ్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో దీక్ష చేపట్టాలని వైఎస్సార్​టీపీ నిర్ణయించింది. శనివారం లోటస్ పాండ్ లో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నేతలు  గట్టు రామచంద్రరావు, పిట్ట రాంరెడ్డి, నీలం రమేశ్, గడిపల్లి కవిత, ఏపూరి సోమన్న సమావేశమై చర్చించారు. అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ఈ దీక్షలో పాల్గొంటాయని పిట్టా రాంరెడ్డి వెల్లడించారు. బీజేపీ మినహా ఇతర పార్టీల అధ్యక్షులను కలిసి మరోసారి దీక్షలో పాల్గొనాల్సిందిగా కోరుతామన్నారు.