
తుంగతుర్తి, వెలుగు: రాష్ట్రంలో నయవంచక పాలన నడుస్తోందని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేయడం లేదని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదని, కేజీ టు పీజీ పత్తా లేదని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లిలో నిరుద్యోగ షర్మిల నిరాహార దీక్ష చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారని, వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదని ఆమె విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లకు హమాలీ పని, టీ కొట్లు దిక్కైతే.. నాలుగైదు మాత్రమే చదివినోళ్లు మంత్రులవుతున్నారని అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌కు చీమ కుట్టినట్టయినా లేదన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగులు నాలుగింతలు పెరిగారని షర్మిల ఆరోపించారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల మధ్య తరగతి ప్రజలు పెద్ద చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్, పథకాల అమలు పేరుతో రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చి.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ రాజన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆమె చెప్పారు.