హామీలు ఎగ్గొట్టడంలో కేసీఆర్ ఫస్ట్: షర్మిల

హామీలు ఎగ్గొట్టడంలో కేసీఆర్ ఫస్ట్: షర్మిల

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంలో సీఎం కేసీఆర్ ముందుంటారని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. రెండు సార్లు అధికారంలోకొచ్చి రుణమాఫీ ఎగ్గొట్టిన మోసగాడు అని మంగళవారం విడుదల చేసిన ప్రెస్​నోట్​లో ఆమె మండిపడ్డారు. ‘‘నాలుగేండ్లవుతున్నా ఇప్పటిదాకా రుణమాఫీ చేయలేదు. విడతల వారీగా రూ.90వేల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశాడు. కేవలం రూ.37వేలలోపు రుణాలు ఉన్న రైతులకు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నడు. 5.66 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది”అని షర్మిల గుర్తు చేశారు. రుణాలు మాఫీ కాకపోవడం, బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులు సూసైడ్​ చేసుకున్నారని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాలను బ్యాంకర్లు వేధిస్తున్నా కేసీఆర్​కు దున్నపోతు మీద వానపడ్డట్టుగానే ఉందని విమర్శించారు. ‘‘లోన్లు ఇచ్చిన బ్యాంకులు రైతులను డిఫాల్టర్లుగా ముద్ర వేశాయి. కల్వకుంట్ల దొర సిగ్గుతో తలదించుకోవాలి”అని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్​ను నమ్మి కిస్తీలు కట్టకపోవడంతో వడ్డీ భారం పడిందని విమర్శించారు. 2018 నుంచి ఇప్పటిదాకా బడ్జెట్​లో రూ.26వేల కోట్లు కేటాయిస్తే, అందులో కేసీఆర్ ఖర్చు చేసింది రూ.1,200 కోట్లే అని పేర్కొన్నారు. మిగిలిన నిధులన్నీ కేసీఆర్ ఖజానాకే వెళ్లిపోయాయని ఆరోపించారు. రైతులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.