బై బై.. కేసీఆర్ సూట్ కేసు సర్దుకునే టైమ్ వచ్చింది : షర్మిల

బై బై..  కేసీఆర్ సూట్ కేసు సర్దుకునే టైమ్ వచ్చింది : షర్మిల

హైదరాబాద్, వెలుగు : “బైబై కేసీఆర్.. కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్దుకునే టైం వచ్చింది. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకోండి. మీ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతుంది. ఆయనకు సూట్ కేస్ గిఫ్ట్ ఇస్తున్నాం” అని వైఎస్ ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని ఆమె వెల్లడించారు. ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందని, కేసీఆర్ అవినీతి మీద కేంద్రం చర్యలు తీసుకోలేదని, వీళ్లిద్దరు తోడుదొంగలు అనేందుకు ఇంత కన్నా మంచి ఉదాహరణ ఏముంటదని షర్మిల తెలిపారు. 

శనివారం లోటస్ పాండ్ లో షర్మిల మీడియాతో మాట్లాడారు.  ‘‘కేసీఆర్​ను మించిన కరెప్ట్ పొలిటీషియన్ లేరని అమిత్ షా చెప్పారు. కేసీఆర్ ఏ స్కీంలు పెట్టినా అవినీతే అని మోదీ విమర్శించారు. మరి కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు” అని షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వం మారాలని రాష్ర్ట ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్​ రెడ్డి ఆర్మీలో పని చేసిన వ్యక్తి అని, భట్టి విక్రమార్క దళితుడు, పాదయాత్ర చేశారని షర్మిల గుర్తు చేశారు.