డీజీపీకి ఫిర్యాదు చేసిన షర్మిల అనుచరులు

డీజీపీకి ఫిర్యాదు చేసిన షర్మిల అనుచరులు

హైదరాబాద్: వైఎస్ షర్మిల పై నిన్న ఏసిపి శ్రీధర్ దురుసుగా ప్రవర్తించడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ షర్మిల అనుచరులు పిట్ట రాంరెడ్డి, ఇందిరా శోభన్  డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. మహిళ అని చూడకుండా చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ షర్మిలపై దాడి చేయించాడని వారు ఆరోపించారు. డీజీపీ ఆఫీసుకు వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేసిన అనంతరం కార్యాలయం బయట వారు మీడియాతో మాట్లాడారు. నిన్న ఇందిరా పార్కు లో షర్మిల తలపెట్టిన దీక్షలో పోలీసుల దురుసు ప్రవర్తన పై డిజీపీ కి ఫిర్యాదు చేసి ఏసీపీ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. శాంతి యుతంగా దీక్ష చేపట్టిన షర్మిల అనుచరులపై పోలీసులు దాడి చేయడం వల్ల దాదాపు 200 మందికి గాయాలు అయ్యాయని వారు ఆరోపించారు. ఏసీపీ శ్రీధర్ బూతులు మాట్లాడారని, పోలీసుల అత్యుత్సాహం వల్ల షర్మిల గాయపడ్డారని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే నిన్న షర్మిల పై దాడి జరిగిందని వారు ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ పైన మహిళలని ఏమాత్రం కనికరం చూపకుండా దాడులు చేశారని, షర్మిల బ్లౌజ్ చింపి విచక్షణ రహితంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజల కోసం ఉన్న డీజీపీ కలవడానికి కూడా సమయం ఇవ్వలేదని, అందుకే ఇన్ వార్డులో తాము వినతిపత్రం ఇచ్చి రావాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఏసీపీ శ్రీధర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు పునరుద్ఘాటించారు.