ఏపూరి సోమన్నపై దాడికి ప్రయత్నం

ఏపూరి సోమన్నపై దాడికి ప్రయత్నం

హుజూర్​నగర్​మండలం లక్కవరంలో వైఎస్సార్టీపీ చీఫ్ ​షర్మిల చేపట్టిన నిరుద్యోగ నిరాహారదీక్షపై టీఆర్ఎస్​కార్యకర్తలు దాడి చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై వైఎస్సార్​టీపీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. టీఆర్ఎస్​ నేతలు వేదికపైకి దూసుకెళ్లారు. ఏపూరి సోమన్నతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. తమపై దాడికి యత్నించిన టీఆర్ఎస్​ నేతలపై, మహిళా కార్యకర్తలపై చేతులేత్తిసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ షర్మిల అక్కడే వైఎస్సార్ విగ్రహం వద్ద 3 గంటలపాటు వానలోనే దీక్ష చేశారు. 

తడుస్తూనే 3 గంటలపాటు నిరసన 
సూర్యాపేట / హుజూర్ నగర్ : వైఎస్సార్ టీపీ చీఫ్ ​షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రపై సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్​ లీడర్లు దాడి చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న హుజూర్​నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. హుజూర్​నగర్ ​మండలం లక్కవరంలో షర్మిల చేపట్టిన నిరుద్యోగ నిరాహారదీక్ష వేదిక వద్దకు టీఆర్ఎస్​ నేతలు చొచ్చుకుపోయారు. ఏపూరి సోమన్నతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. పరిస్థితిని అదుపుచేయాల్సిన పోలీసులు వైఎస్సార్​టీపీ నేతలను ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. తమపై దాడికి యత్నించిన టీఆర్ఎస్​నేతలపై, మహిళా కార్యకర్తలపై చేతులేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల లక్కవరంలో వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఓ గంట తర్వాత జోరువాన ​అందుకుంది. అయినా ఆమె కదలకుండా దాదాపు3 గంటలపాటు వర్షంలోనే దీక్ష చేశారు. కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి అక్కడికి చేరుకొని నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని సర్ది చెప్పడంతో దీక్ష విరమించారు.

టీఆర్ఎస్​నేతలు, పోలీసుల ఓవరాక్షన్​.. 
లక్కవరంలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఏపూరి సోమన్నపై దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న వైఎస్సార్టీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ వాతావరణం మొదలైంది. టీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి పంపించాల్సిన పోలీసులు వైఎస్సార్టీపీ నేతలను ఈడ్చే ప్రయత్నం చేశారు. మహిళా కార్యకర్తలపై పోలీసులు చేయివేసి లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై షర్మిల మండిపడ్డారు. మహిళలపై ఎలా చేయి వేస్తారని ప్రశ్నించారు. ఏపూరి సోమన్నపై దాడికి యత్నించిన వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని, దాడిలో పాల్గొన్న మఠంపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్యపై చర్యలు చేపట్టాలంటూ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేశారు.

ఉద్యమకారులకు రక్షణ లేదు : షర్మిల
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఉద్యమకారులకు, మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని షర్మిల మండిపడ్డారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్న తమపైనే దాడులు జరిగితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన భూకబ్జా దందాలు, పేకాట, గుట్కా, పీడీఎస్​ బియ్యం, గంజాయి వ్యాపారాల గురించి నిలదీసేసరికి భయపడి తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపూరి సోమన్నను చంపేందుకు ప్రయత్నించారని అన్నారు. తనకు రక్షణగా ఉన్న మహిళా కోఆర్డినేటర్లను పోలీసులు అసభ్యంగా తాకారని, వాళ్ల కాళ్లను బూట్లతో తొక్కారని ఫైర్ అయ్యారు. సంబంధిత ఎస్ఐ, సీఐలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. ప్రజల తరఫున తాను మాట్లాడుతానని, హుజూర్ నగర్ ఎవరి జాగీర్ ​కాదన్నారు. తాను కేసీఆర్ కంటే ముందు నుంచే ఉద్యమంలో ఉన్నానని, తెలంగాణ ఉద్యమంలో సైదిరెడ్డి ఎక్కడ ఉన్నారో చెప్పాలని నిలదీశారు.