ఆన్సర్‌‌‌‌ చెబుతానని ఆ వీడియో చూపించాడు

ఆన్సర్‌‌‌‌ చెబుతానని ఆ వీడియో చూపించాడు

హైదరాబాద్, వెలుగు: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై షీటీమ్స్‌‌‌‌ ఉక్కుపాదం మోపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో 49 కేసులు నమోదయ్యాయి. 54 మంది ఈవ్ టీజర్లను అరెస్ట్ చేశారు. ఇందులో 48 మంది మేజర్లు కాగా మరో ఆరుగురు మైనర్లు ఉన్నారు. వీరిలో 19  మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరో 30 పిటి కేసుల్లో పట్టుబడ్డ వారికి ఎల్బీనగర్ లోని సీపీ క్యాంప్ ఆఫీస్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరిలో శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజ్ లు, స్కూల్స్ లో అమ్మాయిలను వేధించిన వారే ఎక్కువగా ఉన్నారు. వీటితో పాటు దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్ధినులను ఆకతాయిల వేధిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులు ఇచ్చిన సమాచారంతో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మఫ్టీలో మాటు వేసి పోకిరీల ఆటకట్టిస్తు్న్నాయి.

ఎగ్జామ్ లో ఇన్విజిలెటర్ వేధింపులు

బీటెక్ ఫైనల్ ఇయిర్ చదువుతున్న ఓ విద్యార్థినితో ల్యాబ్ టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు. మేలో జరిగిన సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తున్న 21 ఏళ్ళ విద్యార్థినిని ఇన్వెజిలెటర్ గా ఉన్న ల్యాబ్ టెక్నిషియన్ లైంగికంగా వేధించాడు. ప్రశ్నలకు ఆన్సర్స్ చెబుతానని దగ్గరికి వెళ్లి తన మొబైల్ లోని పోర్న్ వీడియాలను, ఫొటోలను చూపించాడు. దీంతో పాటు తన ఫోన్ నంబర్ ను విద్యార్థిని పక్కనే ఉన్న బెంచ్ పై రాశాడు. దీంతో భయపడిన ఆమె ఇంటికి వెళ్లిన తరువాత షీ టీమ్స్ కి కంప్లయింట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో అబ్దుల్లాపుర్ మెట్ పోలీస్ స్టేషన్ లో 354(A) ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇన్విజిలెటర్ ను షీ టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

స్విమ్మింగ్ పూల్ లో  కోచ్

9 వ తరగతి చదువుతున్న 13 ఏళ్ళ బాలికకు లైంగిక వేధింపులు తప్పలేదు. సమ్మర్ హాలీడేస్ లో స్విమ్మింగ్ నేర్చుకునేందుకు వెళ్లిన ఓ మైనర్ బాలికను అక్కడే పనిచేసే స్విమ్ కోచ్ వేధించాడు. నాగోల్ బండ్లగూడలోని ఓ స్విమ్మింగ్ పూల్ లో  కోచింగ్ క్లాసులకి వెళ్ళిన బాలిక పట్ల అక్కడి కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రేమించానని.. పెళ్లిచేసుకుంటానని బాలికకు ఫోన్ కాల్స్ చేసేవాడు. తన మాట వినకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని బాలికను బెదిరింపులకు గురి చేశాడు.

కోచ్ వేధింపులకు భయాందోళనకు గురైన ఆ బాలిక స్విమ్మింగ్ క్లాస్ లకి వెళ్ళడం మానేసింది. దీంతో గత నెల 12న బాలిక ఇంటికి వచ్చిన కోచ్ మరోసారి అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన కంప్లయింట్ తో స్విమ్ కోచ్ పై 448, 354 ఐపీసీ, 12 పోక్సో యాక్ట్ కింద ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్ కి తరలించారు.

మల్కాజిగిరిలో ఈవ్ టీజర్లు

మల్కాజిగిరిలోని మల్లికార్జున్ నగర్ లో ఈవ్ టీజింగ్ జరుగుతోందని ట్విటర్ ద్వారా షీ టీమ్ కి సమాచారం అందింది. బాధితులు తెలిపిన ప్రాంతాల్లో షీ టీమ్ పోలీసులు10 రోజుల పాటు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 18 ఈవ్ టీజర్లను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ తో పాటు వార్నింగ్ ఇచ్చారు. ఆపదలో ఉన్న మహిళలు,యువతులు డయల్ 100 లేదా 9490617111 నంబర్ వాట్సప్ నంబర్ కి సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.