- 2025లో 1,149 ఫిర్యాదుల పరిష్కారం
- 366 మంది బ్లాక్ మెయిలర్స్కు శాస్తి
- ‘ప్రేమ..పెండ్లి’ మోసగాళ్లకు కటకటాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నమ్మి స్నేహం చేసి వ్యక్తిగత ఫొటోలు పంచుకున్న యువతి.. ఆ ఫొటోలతోనే బ్లాక్ మెయిల్‌కు గురైంది. డబ్బులిస్తావా? లేదంటే సోషల్ మీడియాలో పెడతాననే బెదిరింపులతో నరకయాతన అనుభవించి చివరకు ‘షీ టీమ్స్’ను ఆశ్రయించి విముక్తి పొందింది. మరో ఘటనలో రోజూ ఆఫీస్‌కు వెళ్తుంటే నీడలా వెంటపడడం, ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులు పరిపాటిగా మారింది. ఫోన్ బ్లాక్ చేసినా కొత్త నంబర్లతో ఫోన్‌చేసి బూతులు తిట్టడం చేసేవాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళకు ‘షీ టీమ్స్’ అండగా నిలిచింది. 2025లో ఇలాంటి 1,149 ఫిర్యాదులను పరిష్కరించి శభాష్అనిపించుకుంది.
పెండ్లి చేసుకో.. కానీ..
2025లో నమోదైన కేసుల్లో 366 మంది బ్లాక్‌మెయిలింగ్ బాధితులున్నారు. ఇందులో ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై చీట్చేసిన వారే ఎక్కువ. వీరంతా తీయని మాటలతో నమ్మించి చనువు పెంచుకుని ఆపై వీడియో కాల్స్ చేసి, పర్సనల్ఫొటోలు తీసుకుని ఉచ్చు బిగించేవారు. వీడియో కాల్‌లో స్క్రీన్ రికార్డింగ్ చేసి, న్యూడ్ఫొటోలను సేవ్ చేసుకుని డబ్బుల కోసం వేధించేవారు.
మరికొందరు ప్రేమ విఫలమైనా, వేరే వ్యక్తులను పెండ్లి చేసుకుంటుందని తెలిసినా పాత ఫొటోలతో బెదిరింపులకు పాల్పడేవారు. ‘వేరే పెండ్లి చేసుకున్నా పర్లేదు.. నీ భర్తతోనే ఉండు.. కానీ, నాతో కూడా టచ్‌లో ఉండాలి.. లేకపోతే మన ఫొటోలు నీ భర్తకు పంపిస్తా’ అంటూ వేధించేవారు. ఈ కేసుల్లో బాధితులకు ధైర్యం చెప్పిన షీ టీమ్స్ నిందితులకు చెక్‌పెట్టి బాధలను దూరం చేసింది.
మమ్మల్ని పట్టుకోలేరు..
అర్ధరాత్రి నిద్రపోనివ్వకుండా కాల్స్‌చేస్తూ, కొత్త నంబర్లు, ఇంటర్నెట్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ కొందరు పైశాచికానందం పొందుతున్నారు. తమను ఎవరూ పట్టుకోలేరని, భరించాల్సిందేనని భయపెట్టేవారు. ఈ తరహా కాల్స్ తో తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నామంటూ 50 మంది మహిళలు ఫిర్యాదు చేయగా, పోలీసులు టెక్నికల్ఎవిడెన్స్తో నిందితులను అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీలు సృష్టించి వేధించడం, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన కంటెంట్ పంపడం వంటి 82 కేసులను పరిష్కరించారు.
3,826 మందికి కౌన్సెలింగ్
ఫిర్యాదులను పరిష్కరించడమే కాకుండా సిటీ వ్యాప్తంగా 15 షీటీమ్స్2025లో బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో మఫ్టీలో నిఘా వేసి 3,826 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పట్టుబడినవారిలో మెజారిటీ నిందితులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉన్న ఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి జైలుకు పంపారు.
మోసగాళ్లపై క్రిమినల్ కేసులు
ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని శారీరకంగా, ఆర్థికంగా వాడుకోవడం.. పెండ్లి ప్రస్తావన రాగానే ముఖం చాటేయడం వంటి 98 ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి కేసుల్లో బాధితులు తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. షీ టీమ్స్ వీరికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మోసగాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాయి.
