కొత్త.. షోరూం కారు.. 3 రూపాయల నిమ్మకాయను తొక్కించే ఆత్రంలో.. 30 లక్షల కారు నుజ్జునుజ్జు

కొత్త.. షోరూం కారు.. 3 రూపాయల నిమ్మకాయను తొక్కించే ఆత్రంలో.. 30 లక్షల కారు నుజ్జునుజ్జు

ఏదైనా కొత్త వాహనం కొనగానే నిమ్మకాయ తొక్కించి ముందుకెళ్లడం మన దేశంలో చూస్తూనే ఉంటాం. కొత్త వాహనం కొన్నారని తెలియగానే ఇరుగుపొరుగు వాళ్లలో, బంధు మిత్రుల్లో ఆనందించే వాళ్లతో పాటు అసూయ పడే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్ల దిష్టి తగలకుండా నిమ్మకాయను తొక్కించి వాహనం తీస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అయితే.. ఇలానే నిమ్మకాయను తొక్కించి కారు షో రూం నుంచి కొత్త కారును తీయబోతుంటే పెద్ద ప్రమాదమే జరిగి కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.

అదృష్టవశాత్తూ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆ కారు నడిపిన మహిళకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే.. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని నిర్మన్ విహార్ మహీంద్ర షోరూంకు మణి పవార్ అనే మహిళ వెళ్లింది. ఫస్ట్ ఫ్లోర్లో ఆ షో రూం ఉంది. ఆమె తాను కొనుగోలు చేసిన బ్రాండ్ న్యూ థార్ డెలివరీకి రావడంతో కారును ఇంటికి తీసుకెళ్లడానికి షోరూంకు వెళ్లింది. ఈ కారు ఖరీదు 27 లక్షలు.

కారుకు షోరూంలోనే పూజ చేసి, దిష్టి తీసి.. నిమ్మకాయ తొక్కించి ఆ థార్ను ఇంటికి డ్రైవ్ చేసుకుని వెళ్లాలని పవార్ భావించింది. ఆమె కోరుకున్నట్టు గానే పూజ చేశారు. ఆ పూజలో భాగంగా కారు ముందు చక్రం కింద నిమ్మకాయ పెట్టారు. ఆ నిమ్మకాయను తొక్కించి కారు తీయాలి. ఆ ఉద్దేశంతోనే పవార్ తన కారును నెమ్మదిగా ముందుకు డ్రైవ్ చేసి నిమ్మకాయను తొక్కించాలనుకుంది. కానీ.. కారు కొన్న ఎగ్జైట్మెంట్లోనో, ఎమోషనల్ మూమెంట్ ఇచ్చిన హై కారణంగానో.. పొరపాటున యాక్సలరేటర్ ప్రెస్ చేసింది. ఆమెతో పాటు ఆ కారులో షో రూం ఉద్యోగి వికాస్ కూడా ఉన్నాడు. 

ఆమె యాక్సిలరేటర్ ప్రెస్ చేయడంతో కారు ముందుకు దూసుకెళ్లి ఫస్ట్ ఫ్లోర్ అద్దాలు బద్ధలు కొట్టుకుంటూ రోడ్డు మీదకెళ్లి పడింది. ఆ సమయంలో రోడ్డు మీద ఎవరూ లేకపోవడం, ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 6 గంటల 8 నిమిషాల సమయంలో జరిగింది. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.