గొర్రెలకు మేత లేక.. అమ్ముకుంటున్నరు

గొర్రెలకు మేత లేక.. అమ్ముకుంటున్నరు
  • అనుభవం లేని వారికి గొర్రెల అందజేత
  • వచ్చిన కాడికి విక్రయించుకుంటున్న వైనం
  • అక్రమాలపై పర్యవేక్షణ తమది కాదంటున్న అధికారులు
  • పచ్చికబయళ్లు చూపిస్తామని అప్పట్లో సీఎం హామీ

వనపర్తి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం కురుమ యాదవులకు పంపిణీ చేసిన గొర్రెలను మేత లేక అమ్ముకుంటున్నరు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుట్టలు, బంజరు భూములను చదును చేస్తుండడం, సాగు విస్తీర్ణం పెరగడంతో గొర్రెలకు మేత కరువైంది. దీనికి తోడు అనుభవం లేనివారికి గొర్రెలు పంపిణీ చేస్తుండటంతో వారు ఆ గొర్రెలను అమ్మేస్తున్నారు. మాంసం వ్యాపారులు తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి  వేల గొర్రెలు, మేకలను తీసుకువస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర , రాజస్థాన్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి గొర్రెలు దిగుమతి చేసుకుంటున్నారు. 

ఒక్క హైదరాబాద్ లోనే వారానికి లక్షకు పైగా మేకలు, గొర్రెలను వ్యాపారులు మాంసం అవసరాలకు తెప్పిస్తున్నారు. దీంతో కురుమ యాదవులకు గొర్రెలను సబ్సిడీపై అందిస్తే వారికి ఉపాధి దొరకడంతో పాటు తెలంగాణ అవసరాలకు తగ్గ గొర్రెలను ఉత్పత్తి చేయవచ్చని ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల పథకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నది. 

పచ్చిక బయళ్లు ఏవీ?               

ఈ పథకం ప్రారంభించినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రతి గ్రామంలో గొర్రెల మేత కోసం పచ్చికబయళ్లు చూపిస్తామని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, బంజరు భూముల్లో పచ్చిక పెంచి కురుమ యాదవుల గొర్రెలకు మేత సమకూరుస్తామని ఆయన ప్రకటించారు. కానీ, గొర్రెలకు చాలినంత మేత దొరకక గొర్రెల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రెల జనాభా అధికంగా ఉండేది. ఉమ్మడి ఏపీలోనే ఇక్కడి నుంచి గొర్రెలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేవారు. అప్పట్లో గొర్రెలు పెంచేందుకు అనువైన పరిస్థితి ఉండేది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గొర్రెల జనాభా ప్రభుత్వ లెక్కల ప్రకారం 12 లక్షలకు పైగా ఉంది. వాస్తవంగా ఇక్కడ ఐదు లక్షకు మించి గొర్రెలు లేవని పశువైద్యాధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ మొదలుపెట్టింది. 

ఇప్పటికే డీడీలు కట్టి దరఖాస్తు చేసుకున్న వారికి గొర్రెలు అందజేస్తున్నారు. అయితే, వాటిని తీసుకున్న కాపరులు వచ్చిన కాడికి అమ్మేస్తున్నారు. దళారులకు ఇది మంచి ఆదాయ వనరుగా మారింది. ప్రభుత్వ సబ్సిడీలో కట్టిన డీడీ డబ్బులకు రూ.పది వేలు కలిపి లబ్ధిదారులకు ఇచ్చి మిగతాది ఆయా మండల  లీడర్లు, దళారీలు నొక్కేస్తున్నారు. వనపర్తి జిల్లాలో మొత్తం మూడు నియోజకవర్గాల పరిధిలో 14 మండలాలు ఉండగా ప్రభుత్వం 10,496 మందికి సబ్సిడీ గొర్రెలను ఇచ్చేందుకు యూనిట్లను మంజూరు చేసింది. 

ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనల మేరకు గత నెల రోజులుగా గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మండలానికి ఒకరిద్దరు నాయకులు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. వెటర్నరీ అధికారులపై ఒత్తిడి తెస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. కొన్ని చోట్ల గొర్రెలు అమ్మినట్లు చూపించి సబ్సిడీ మొత్తాన్ని  దళారులే కాజేస్తున్నారు. వానాకాలంలో పంటలు సాగుచేశాక  గ్రామ శివార్లలోని గుట్టల ప్రాంతంలో గొర్రెలు ఉంచాల్సి వస్తోందని కాపర్లు చెబుతున్నారు. కాపు కోసం సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో గొర్రెల పెంపకాన్ని పలువురు కాపరులు వదిలేస్తున్నారు. 

పర్యవేక్షణ  అధికారం ఏదీ?

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం లో జరుగుతున్న అక్రమాలను పర్యవేక్షించే అధికారం జిల్లా కలెక్టర్ కు సైతం లేదు. దీంతో కలెక్టర్లు ఈ పథకంలో జరుగుతున్న అక్రమాలను చూస్తూ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఒక యూనిట్  కోసం దరఖాస్తు చేసుకునే  గొల్ల కురుమలు ముందుగా రూ.43,750  డీడీ తీయాలి. దీంతో వారికి ఐడీ క్రియేట్ అయ్యి ప్రభుత్వానికి దరఖాస్తు వెళ్తుంది. మొత్తం 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలును సబ్సిడీపై అందిస్తారు. వాటి విలువ సుమారు రూ.లక్షపైనే ఉంటుంది. అంటే లబ్ధిదారులకు వారు కట్టిన డీడీ డబ్బులుపోను రూ.60 వేల దాకా రాయితీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని ఉపయోగించుకొని వారే గొర్రెలు పెంచుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. 

కానీ, గ్రామాల్లోని గొల్ల కురుమలు చాలా మంది ఈ వృత్తికి దూరంగా ఉంటున్నారు. దీంతో వారందరితో ఆయా గొర్రెల కాపరుల సంఘం నాయకులే డీడీ లు తీయించి సబ్సిడీ మొత్తాన్ని పక్కదారి పట్టిస్తున్నారని కాపరులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గొర్రెల పంపిణీ సమయంలో ఇతర రాష్ట్రాల్లోని గొర్రెలను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో లబ్ధిదారులతో పాటు ఇద్దరు స్పెషల్  ఆఫీసర్లు గొర్రెల ఎంపిక కోసం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి గొర్రెలను కొనుగోలు చేసిన తర్వాత గ్రామంలోకి వచ్చిన వెంటనే ఆయా మండలాల పశువైద్యాధికారులు వాటిని పరీక్షించాలి. అనంతరం గొర్రెల కాపరుల సొసైటీ అధ్యక్షులు, సభ్యుల సమక్షంలో గ్రామ సర్పంచ్  ఆ గొర్రెలను లబ్ధిదారులకు అప్పగించాలి. కానీ, ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. వనపర్తి జిల్లా యూనిట్లను కడప, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉన్నా అక్కడికి వెళ్లకుండానే ఇక్కడి గొర్రెలను ఇక్కడే కొని, అమ్మినట్లు చూపుతున్నారని గొర్రెల కాపర్లు 
పేర్కొంటున్నారు. 

గొర్రెల పంపిణీ వరకే మా బాధ్యత

జిల్లాలోని కురుమ, యాదవులకు గొర్రెలను కొనుగోలు చేసేందుకు కడప, ప్రకాశం జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జిల్లా ఇండస్ట్రియల్  అధికారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను ప్రత్యేక అధికారులుగా నియమించి ఆయా జిల్లాల్లో గొర్రెలను కొనుగోలు చేస్తున్నాం. వాటిని కొని గ్రామాలకు తరలించి సర్పంచ్, గొర్రెల కాపరుల సంఘం నాయకుల సమక్షంలోనే లబ్ధిదారులకు ఆ గొర్రెలను అందిస్తున్నాం. 

వీటిని పంపిణీ చేసేంత వరకే మా బాధ్యత. గొర్రెలను లబ్ధిదారులు ఇతరులకు అమ్ముతున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహరంపై కలెక్టర్  జిల్లా గొర్రెల కాపరుల సంఘం లీడర్లతో మాట్లాడారు. అక్రమాలు జరగకుండా చూడాలని వారికి  కలెక్టర్ సూచించారు.  
‌‌ - వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ ఇన్ చార్జి, వనపర్తి

నిజమైన కాపర్లకు పంపిణీ చేయడంలే

ప్రభుత్వం నిజమైన కాపరులకు  గొర్రెలను పంపిణీ చేయడం లేదు. ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది కుటుంబాలే గొర్రెల పెంపకం చేపడుతుండగా ప్రభుత్వం మాత్రం ఒక్కో గ్రామంలో ఈ వృత్తిలో లేని యాదవ కులం యువకులకు గొర్రెలను పంపిణీ చేస్తున్నది. దీంతో వారు ఆ గొర్రెలను మేపలేక వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు. పశువైద్యాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ పథకంలో 90 శాతం అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్  నాయకులు తమకు అనుకూలమైన వారినే గొర్రెల పథకం పంపిణీకి ఎంపిక చేస్తున్నారు. 
- సాయిలు , గొర్రెల కాపరి, పాన్ గల్