- బస్సులు మారుస్తూ ఒకే డ్రైవర్ తో ప్రతిరోజు డ్యూటీలు చేయిస్తున్రు
- 500 కిలోమీటర్లు ఒకే డ్రైవరు నడుపుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు
గద్వాల,వెలుగు:ఆర్టీసీ అద్దె బస్సులపై అధికారుల ఆజమాయిషీ కరువవుతోంది. ఓనర్లు ఇద్దరు డ్రైవర్లను పెట్టుకోకుండా ఒకే డ్రైవర్ తో డ్యూటీ చేయిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజు తప్పించి రోజు డ్యూటీకి రావాల్సి ఉన్నప్పటికీ ఒకే డ్రైవర్ తో డ్యూటీ చేయిస్తున్నారు. దీంతో జిల్లాలో గత నెల రోజుల్లో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయనే విమర్శలున్నాయి.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పెబ్బేరు బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు వెనుక టైర్ కింద పడి ఓ మహిళ తీవ్రగాయాల పాలై, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ రెండు రోజుల కింద చనిపోయింది. గద్వాల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బస్సు ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి.
రూల్స్ బ్రేక్ చేస్తున్రు..
ఆర్టీసీ డ్రైవర్లకు, అద్దె బస్సు డ్రైవర్లకు ఒకే రూల్స్ ఉంటాయి. కానీ, ఆర్టీసీ అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఒకే డ్రైవర్ తో ప్రతి రోజు డ్యూటీ చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్టీసీ డ్రైవర్ అయిజ నుంచి గద్వాలకు ఇక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లి అయిజ మీదుగా గద్వాలకు బస్సు నడిపితే మరుసటి రోజు ఆ డ్రైవర్ కు సెలవు ఇస్తారు.
ఇదిలాఉంటే గద్వాల నుంచి అయిజ మీదుగా హైదరాబాద్, అక్కడి నుంచి కర్నూల్ కు, అక్కడి నుంచి అయిజ మీదుగా గద్వాల వరకు బస్సు నడిపిన అద్దె బస్సు డ్రైవర్‌కు మరుసటి రోజు సెలవు ఇవ్వకుండా డ్యూటీ చేయిస్తున్నారు. ఒకే డ్రైవర్ వరుసగా డ్యూటీలు చేయడంతో రెస్ట్ లేకుండా పోతోంది.
పత్తా లేని 8 గంటల డ్యూటీ..
రోడ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారం ఒక డ్రైవర్ రోజుకు 8 గంటలు డ్యూటీ మాత్రమే చేయాలి. కానీ, అద్దె బస్సుల్లో ఆ ఊసే లేదు. ఉదయం డ్యూటీకి వచ్చిన డ్రైవర్ రాత్రి వరకు డ్యూటీ చేయడం, తిరిగి మరుసటి రోజు డ్రైవింగ్ కు రావడం అద్దె బస్సుల్లో సర్వసాధారణంగా మారింది. తమకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో అద్దె బస్సు ఓనర్లు ఒకే డ్రైవర్ తో ప్రతిరోజు 300 నుంచి 500 కిలోమీటర్లు బస్సులను నడిపిస్తున్నారని అంటున్నారు.
దీనికి కొందరు ఆర్టీసీ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ఈ రోజు ఒక బస్సుపై డ్యూటీ చేస్తే, మరుసటి రోజు వేరే బస్సుపై డ్యూటీకి వెళ్తూ ఆర్టీసీ ఆఫీసర్లను ప్రైవేట్ బస్ డ్రైవర్లు, ఓనర్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని డిపోల్లో ఆర్టీసీ బస్సుల కంటే అద్దె బస్సులే ఎక్కువగా ఉన్నాయి. గద్వాలలో 44, నారాయణపేటలో 41, మహబూబ్ నగర్ లో 83, వనపర్తిలో 44, షాద్ నగర్ లో 35, కల్వకుర్తిలో 32, అచ్చంపేటలో 24 , కొల్లాపూర్ లో 25 అద్దె బస్సులు ఉన్నాయి.ఉమ్మడి జిల్లాలోని పలు డిపోల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.
ఆర్టీసీకి నష్టం కలిగిస్తున్రు..
అద్దె బస్సు డ్రైవర్లు ప్రయాణికులు బస్సు ఆపమన్న చోట ఆపకుండా వెళ్లడం, మైలేజీ కోసం బస్సులు స్లోగా నడిపిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. డ్రైవర్ ప్రయాణికులతో దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
స్కూల్ పిల్లలను బూతులు తిడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కండక్టర్ తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. అద్దె బస్సు డ్రైవర్లకు తిరిగిన కిలోమీటర్లపైనే దృష్టి ఉంటుందని ప్రయాణికులు ఎక్కారా? లేదా? అనే విషయంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తుండడంతో ఆర్టీసీకి నష్టం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రూల్స్ పాటించాల్సిందే..
అద్దె బస్సుల్లో తప్పకుండా ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే రూల్‌ను పాటిస్తున్నాం. ఓవర్ డ్యూటీ లేకుండా అద్దె బస్సులు నడిపించాలని ఓనర్లకు సూచిస్తున్నాం. ఓవర్ డ్యూటీపై దృష్టి పెడతాం. రోడ్ ట్రాన్స్ పోర్ట్ రూల్స్ తప్పకుండా పాటించేలా చూస్తాం. సునీత, డీఎం, గద్వాల.
