
తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసు విచారణలో ఈడీ దర్యాప్తు ముమ్మురం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని 10 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది . ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. జులై 30న ఉదయం సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్, అత్తాపూర్ తో పాటు పలు చోట్ల సోదాలు చేస్తోంది.
పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ , కాంట్రాక్టర్ ఖాజా మొయినొద్దీన్ , ఈక్రముద్దీన్ , దిల్ సుఖ్ నగర్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది. మొయినుద్దీన్ లోలోన రిజిస్టర్డ్ కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతోన్నాయి.
గొర్రెల స్కీమ్‌లో రూ. 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించింది. ఈ కేసులో నిందితులైన రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ రాంచందర్‌నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి సహా మొత్తం 17 మందిని ఏసీబీ ఇదివరకే అరెస్ట్ చేసింది.
రూ. 2.10 కోట్లు బినామీ అకౌంట్స్‌లో జమ
గొర్రె పిల్లల కొనుగోలు కోసం కొండాపూర్‌లోని ‘లోలోనా ది లైవ్ కంపెనీ’కి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన సయ్యద్ ఖాజా మొయినొద్దీన్ తో పాటు పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. 2017 నుంచి గొర్రెలను సప్లయ్ చేస్తున్న 18 మంది రైతుల వద్ద133 యూనిట్లను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన రూ.2.10 కోట్లు తమ బినామీల అకౌంట్స్‌లో డిపాజిట్ చేసుకున్నారు. బినామీ అకౌంట్ హోల్డర్స్‌నే గొర్రె పిల్లలను విక్రయించిన రైతులుగా రికార్డుల్లో చూపారు. అసలైన రైతులకు ఎలక్షన్ కోడ్ కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు.
గుట్టురట్టు కావడంతో దుబాయ్ పరార్
ఎలక్షన్స్ కోడ్ ముగిసిన తర్వాత కూడా రైతులకు చేరాల్సిన డబ్బు వారి అకౌంట్స్‌లో డిపాజిట్ కాలేదు. దీంతో బాధిత రైతులు మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు. తమకు రావాల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన ఇతరుల అకౌంట్స్‌లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. 2023 డిసెంబర్‌లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుని ఏసీబీకి బదిలీ చేసింది. అదే సమయంలో ఖాజా మొయినొద్దీన్, ఆయన కొడుకు దుబాయ్ కి పారిపోయారు. వీరిపై ఏసీబీ అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ సహకారంతో మొయినొద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
►ALSO READ | కేజీబీవీ స్టూడెంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఫ్రీగా స్పోర్ట్స్ సూట్, షూస్