ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు

ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు

హైదరాబాద్‌‌, వెలుగు: గొర్రెల పంపిణీ స్కీమ్‌‌ స్కామ్‌‌ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితులైన నలుగురు ప్రభుత్వ అధికారులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నది. పశుసంవర్ధక శాఖ అధికారులైన కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ  హాస్పిటల్‌‌ అసిస్టెంట్‌‌  డైరెక్టర్‌‌‌‌ ధర్మపురి రవి, మేడ్చల్  పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌‌  డైరెక్టర్‌‌  ముంత ఆదిత్య కేశవసాయితో పాటు రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌‌ వాటర్ ఆఫీసర్‌‌  ‌‌పి.రఘుపతి రెడ్డి, నల్లగొండ వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌‌ సంగు గణేశ్​ను ఏసీబీ అధికారులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు విచారణలో భాగంగా ఉదయం చంచల్‌‌గూడ జైలు నుంచి నలుగురిని బంజారాహిల్స్‌‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. డీఎస్‌‌పీ ఆధ్వర్యంలో విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత వివరాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న డిపార్ట్‌‌మెంట్స్‌‌కి సంబంధించిన వివరాలు సేకరించారు.

కాంట్రాక్టర్‌‌‌‌తో అధికారుల కుమ్మక్కుపై ఆరా

గత బీఆర్‌‌‌‌ఎస్‌‌  ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రైతులకు చేరాల్సిన రూ.2.10 కోట్లను కాంట్రాక్టర్‌‌‌‌, పశుసంవర్ధక శాఖ అధికారులు కుమ్మక్కై దారి మళ్లించిన విషయం తెలిసిందే. ఈ నిధులు పది బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్  అయినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. రవి, ఆదిత్య కేశవసాయి, రఘుపతిరెడ్డి, సంగు గణేశ్ ను ప్రధాన నిందితులుగా గుర్తించారు. కాంట్రాక్టర్  మొహిదుద్దీన్‌‌, ఇక్రముద్దీన్‌‌తో వారికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.