
- ఈడీ దర్యాప్తులో వెల్లడి.. తనిఖీల్లో కీలక ఆధారాలు
- 7 జిల్లాల్లోనే రూ.253 కోట్లు గోల్‌మాల్
- గొర్రెలు కొనలే.. పంపిణీ చెయ్యలే.. అంతా కాగితాల్లోనే
- చనిపోయినోళ్ల పేరు మీద యూనిట్లు మంజూరు
- గొర్రెల రీసైక్లింగ్ దందాతో ప్రభుత్వ ఖజానాకు గండి
- ‘నీకింత.. నాకింత’ రీతిలో దోచుకున్న దొంగలు
- 200కు పైగా మ్యూల్ అకౌంట్లు.. బెట్టింగ్ యాప్స్‌తో లింకులు
- సోదాల్లో 31 సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డ్‌లు సీజ్
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో రూ.వెయ్యి కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టు బయటపడింది. ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లు కలిసి 200కు పైగా మ్యూల్/డమ్మీ బ్యాంక్ అకౌంట్లతో సర్కార్ ఖజానాకు గండి కొట్టినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం నిర్వహించిన సోదాల్లో డమ్మీ/మ్యూల్ అకౌంట్లకు చెందిన డాక్యుమెంట్లు, చెక్‌బుక్స్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ అకౌంట్ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు జరిగిన లావాదేవీల లింకులను గుర్తించింది. ఇందుకోసం వినియోగించిన 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులను సీజ్ చేసింది. గొర్రెల స్కీమ్‌లో కొల్లగొట్టిన కోట్ల రూపాయలు దారిమళ్లించేందుకు వీటిని ఉపయోగించినట్టు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు తనిఖీల వివరాలను వెల్లడిస్తూ ఈడీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
భారీగా అక్రమాలు..
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పని చేసిన గుండమరాజు కల్యాణ్ కుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశుసంవర్థక శాఖ కార్యాలయంలోని కొన్ని రికార్డులను ధ్వంసం చేసి తీసుకెళ్లాడు. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గొర్రెల వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని కల్యాణ్‌కుమార్ ఇంటితో పాటు షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మాజీ సీఈవో రాంచందర్ నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్ రావు, కాంట్రాక్ట్ సంస్థ ‘లోలోనా ది లైవ్’ ఓనర్లు మొయిద్దీన్, ఇక్రముద్దీన్ ఇండ్లు, ఆఫీసులు సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ‘లోలోనా ది లైవ్’ కంపెనీ ద్వారా 2017 నుంచి కొనుగోలు, పంపిణీ చేసిన యూనిట్లకు సంబంధించి భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది.
కాగ్ నివేదికతో అంచనా..
దర్యాప్తులో భాగంగా కాగ్ నివేదికతో పాటు పశుసంవర్థక శాఖ, షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌లో గొర్రెల పంపిణీకి సంబంధించిన ఆడిట్ రికార్డులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ రికార్డులను ఈడీ అధికారులు సేకరించారు. ఇందులో 2021 మార్చి నాటికి కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారం గా గొర్రెల స్కీమ్‌లో జరిగిన అక్రమా లను గుర్తించారు. గొర్రెల స్కీమ్‌తో 7 జిల్లాల్లో రూ.253.93 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్టు కాగ్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో మొత్తం 33 జిల్లాలకు సంబం ధించి రూ.వెయ్యి కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు దారిమళ్లినట్టు ఈడీ గుర్తించింది.
నిధులు మళ్లించి దోపిడీ..
మాజీ మంత్రి తలసాని వద్ద ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్‌కుమార్.. గొర్రెల స్కామ్‌లో కీలక సూత్రధారిగా ఈడీ ఆధారాలు సేకరించింది. ‘నీకింత నాకింత’ (కిక్‌బ్యాక్) తరహాలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్లు కలిసి రూ.వెయ్యి కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను దోచుకున్నట్టు గుర్తించింది. గొర్రెల సరఫరా పేరుతో ప్రైవేట్ వ్యక్తులు/సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించడం.. గొర్రెలను తరలించినట్టు నకిలీ బిల్లులు పెట్టడం.. ఒక్కసారి కొనుగోలు చేసిన గొర్రెలనే మళ్లీ మళ్లీ పంపిణీ చేయడం (రీసైక్లింగ్), చనిపోయినోళ్ల పేర్ల మీద గొర్రెల యూనిట్లను కేటాయించడం లాంటి అక్రమాలు జరిగినట్టు ఆధారాలు సేకరించింది.
గొర్రెల కొనుగోలు చేసినట్టు, వాటిని తరలించినట్టు, లబ్ధిదారులకు అందజేసినట్టు.. ఇలా అంతా కేవలం కాగితాలపైనే చూపినట్టు గుర్తించింది. నకిలీ సరఫరాదారులు, లబ్ధిదారులు పేర్లతో నిధులు మళ్లించినట్టు తేల్చింది. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలు, గొర్రెల కొనుగోళ్లకు చెల్లింపులు, ట్రాన్స్‌పోర్ట్ బిల్లులు, ఇన్‌వాయిస్‌లు సరిగా లేని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది.