నేను చచ్చాక కూడా.. న్యాయం జరిగేది కాదు

నేను చచ్చాక కూడా.. న్యాయం జరిగేది కాదు
  • నేను చచ్చాక కూడా.. న్యాయం జరిగేది కాదు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజల్
  • ఆధారాలు ఉన్నా కేసు రిజిస్టర్ చేయడం లేదని ఆవేదన
  • న్యాయం జరిగే వరకు  ఢిల్లీ వదిలేది లేదని కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అతని అనుచరుల ప్రచారం చూస్తుంటే తాను చనిపోయాక కూడా న్యాయం జరగకపోయేదనే విషయం స్పష్టమవుతున్నదని బాధితురాలు షేజల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే వేధింపులపై అన్ని ఆధారాలు ఉన్నా.. పోలీసులు కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదని విమర్శించింది.

సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో షేజల్ మీడియాతో మాట్లాడారు. ‘‘దుర్గం చిన్నయ్య చేసిన చాట్​ను బయటపెడితే ఆ నంబర్ నాది కాదని తప్పించుకున్నాడు. కానీ, అదే నంబర్ ఎమ్మెల్యే వాడుతున్నాడు. అతని అనుచరులు నా ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. ఎంత పోరాటం చేసినా న్యాయం జరగకపోవడంతోనే ఆత్మహత్యాయత్నం చేశాను”అంటూ కన్నీరుమున్నీరైంది.

ప్రభుత్వ స్థలాన్ని తన స్థలంగా చూపించి ఎమ్మెల్యే మోసం చేసినట్లు ఆరోపించింది. పనులు చేయించుకోవాలంటే అమ్మాయిలను పంపాలంటూ దుర్గం చిన్నయ్య డిమాండ్ చేసేవారని తెలిపింది. ఎమ్మెల్యే ప్లాన్​లో భాగంగానే రైతులతో తనపై కేసులు పెట్టించాడని షేజల్ తెలిపింది. తన ఫ్యామిలీ మెంబర్స్​ను కూడా ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారని వాపోయింది. తనకు న్యాయం జరిగేంత వరకు ఢిల్లీ వదిలేది లేదని స్పష్టం చేసింది. నిరసన వెనుక ఏ పార్టీ వాళ్లు లేరని వెల్లడించింది.