క్రికెట్లో కొత్త ట్రెండ్ .. ప్రైజ్ మనీ కింద.. అర ఎకరం భూమి

క్రికెట్లో కొత్త ట్రెండ్ .. ప్రైజ్ మనీ కింద.. అర ఎకరం భూమి

అంతర్జాతీయ మ్యాచ్ అయినా..దేశ వాలీ మ్యాచ్ అయినా..లేక లీగ్ టోర్నీ అయినా..క్రికెటర్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ లేదా ఇతర విభాగాల్లో అవార్డులు అందిస్తారు. ఈ అవార్డుల కింద ఆటగాళ్లకు ట్రోఫీలతో పాటు..నగదు బహుమతులు ప్రదానం చేస్తారు. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్ల క్రికెట్లో ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. కానీ క్రికెట్ చరిత్రలో మొట్ట మొదటి సారిగా...ఓ క్రికెటర్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కింద భూమిని బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

ఫైనల్లో ఇరగ్గొట్టాడు అందుకే..

కెనడా దేశంలోని ఓంటేరియో రాష్ట్రంలో బ్రాంప్టన్ పట్టణంలో గ్లోబల్ T20 కెనడా 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్లో  మాంట్రియల్ టైగర్స్, సర్రే జాగ్వార్స్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఆ తర్వాత 131 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మాంట్రియల్ టైగర్స్..సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో మాంట్రియల్ టైగర్స్ ఆటగాడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ అద్భుతంగా ఆడాడు. ఓటమి అంచుల్లో ఉన్న జట్టును కిర్రాక్ బ్యాటింగ్తో గెలిపించాడు.  

ప్లేయర్ ది సిరీస్ కింద అర ఎకరం భూమి..

ఫైనల్లో 29 బంతుల్లో 2 సిక్సులు, 3 ఫోర్లతో 38 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు..ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు దక్కాయి. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింద షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కు 1000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ అందించగా..ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ కింద మాత్రం అమెరికా అర ఎకరం భూమిని గిఫ్ట్గా అందించారు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా భూమి ఇవ్వడం ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో చర్చనీయాంశంగా  మారింది.