ధవన్ కెప్టెన్సీలో శ్రీలంక టూర్!

ధవన్ కెప్టెన్సీలో శ్రీలంక టూర్!

న్యూఢిల్లీ:  గతానికి భిన్నంగా.. టీమిండియా తొలిసారి ఒకేసారి రెండు దేశాల్లో క్రికెట్‌‌ ఆడనుంది. ఓవైపు కోహ్లీ కెప్టెన్సీలోని టెస్టు టీమ్‌‌.. ఇంగ్లండ్‌‌తో టెస్టు సిరీస్‌‌కు ఆ దేశ గడ్డపై ప్రిపేర్‌‌ అవుతుండగా..  మరోవైపు ఇంకో టీమ్‌‌ శ్రీలంకలో  వన్డే, టీ20ల్లో బరిలోకి దిగనుంది. ఈ లిమిటెడ్‌‌ ఓవర్ల టీమ్‌‌కు సీనియర్‌‌ ప్లేయర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ కెప్టెన్‌‌గా ఉండే అవకాశం ఉంది.  వచ్చే జులైలో టీమిండియా.. శ్రీలంక టూర్‌‌కు వెళ్లడం ఖాయమైంది. ఫ్యూచర్​ టూర్స్​ ప్రోగ్రామ్ (ఎఫ్​టీపీ) ప్రకారం ఇండియా... శ్రీలంకలో పర్యటిస్తుందని బీసీసీఐ ప్రెసిడెంట్​ సౌరవ్​ గంగూలీ ఆదివారం ప్రకటించడంతో ఈ టూర్​కు మార్గం సుగమం అయ్యింది.  లంక బోర్డు ప్రతిపాదన మేరకు ఈ టూర్​లో ఇండియా ..ఆతిథ్య జట్టుతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్​లు ఆడే అవకాశముంది.  ప్రస్తుతమున్న సమాచారం మేరకు జులై 13, 16, 19వ తేదీల్లో వన్డే మ్యాచ్​లు జరుగుతాయి. ఆ తర్వాత జులై 22, 24, 27వ తేదీల్లో ఇరుజట్ల మధ్య వరుసగా మూడు టీ20 మ్యాచ్​లు ఉంటాయి. అయితే, ఈ షెడ్యూల్​పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, జట్టు విషయానికొస్తే లంక టూర్​కు వేరే జట్టును పంపిస్తామని గంగూలీ ఇప్పటికే చెప్పాడు. అంటే వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్​తోపాటు ఇంగ్లండ్​ టూర్​కు ఎంపికైన ప్లేయర్లు ఎవ్వరూ ఈ టూర్​లో ఉండే అవకాశం లేదు. దీని ప్రకారం కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ లేకుండా లంక సిరీస్​లో ఇండియా టీమ్‌‌ ఆడనుంది. వైట్​బాల్​ స్పెషలిస్టులు శిఖర్​ధవన్​, హార్దిక్​ పాండ్యా, భువనేశ్వర్​ కుమార్​ తదితరులు లంక టూర్​కు వెళతారు.

జులై 5న లంకకు...

బీసీసీఐ వర్గాల నుంచి ఉన్న సమాచారం మేరకు ఇండియా వైట్​బాల్​ టీమ్‌‌ జులై 5న శ్రీలంకలో అడుగుపెట్టనుంది. ఆ తర్వాత వారం రోజులు క్వారంటైన్​లో ఉంటుంది. ఈ ఏడు రోజుల క్వారంటైన్​ను రెండు భాగాలుగా విభజించారు. ఇందులో తొలి మూడు రోజులు ప్లేయర్లు, సపోర్ట్​ స్టాఫ్​ అంతా హోటల్​ రూమ్స్​కే పరిమితం అవుతారు. అనంతరం నాలుగో రోజు నుంచి ట్రెయినింగ్​ మొదలవుతుంది. ఈ సమయంలోనూ ప్లేయర్లు ప్రోటోకాల్స్​ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. హోటల్​ రూమ్​, గ్రౌండ్​ తప్ప మరే ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతించరు. అనంతరం వన్డే, టీ20 సిరీస్​లు ముగించుకుని జులై 28న స్వదేశానికి తిరుగుపయనమవుతారు. కాగా, కరోనా ప్రోటోకాల్స్​ నేపథ్యంలో ఈ టూర్​ అంతా ఖాళీ స్టేడియాల్లో జరగనుంది. ప్రస్తుతానికైతే ప్రేక్షకులను  అనుమతించే అవకాశం కనిపించడం లేదు. కాగా, 2018లో నిదాస్​ ట్రోఫీ కోసం టీమిండియా చివరిగా లంక టూర్‌‌కు వెళ్లింది. ఇప్పుడు ఈ సిరీస్​ అనుకున్న ప్రకారం జరిగితే దాదాపు మూడేళ్ల తర్వాత లంకలో ఆడబోతుంది. మరోపక్క, శ్రీలంక జట్టు త్వరలో ఇంగ్లండ్​లో పర్యటించనుంది. జూన్​ 23 నుంచి జులై 4 మధ్యలో జరిగే సిరీస్​లో శ్రీలంక, ఇంగ్లండ్​ మధ్య మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్​లు జరగనున్నాయి.  ఇంగ్లండ్​ టూర్​ పూర్తి అయిన వెంటనే స్వదేశానికి రానున్న లంక జట్టు సొంతగడ్డపై ఇండియాతో పోటీపడనుంది.

19లోపు ముంబై బబుల్‌‌లోకి రావాలి

న్యూజిలాండ్‌‌తో వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ కోసం ఇంగ్లండ్‌‌ వెళ్లే  ముందు  ప్లేయర్ల కోసం బీసీసీఐ ముంబైలో ఎనిమిది రోజుల బయో బబుల్‌‌ ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు సెలెక్టైన ప్లేయర్లంతా ఈ నెల 19వ తేదీలోపు ఈ బబుల్‌‌లో చేరాలని తెలిపింది. ఈ మేరకు తమకు సమాచారం వచ్చిందని ఓ ప్లేయర్‌‌ తెలిపాడు. యూకేలో కఠిన క్వారంటైన్‌‌ను తప్పించేందుకే  ఇక్కడ బబుల్‌‌ ఏర్పాటు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘8-–9 నెలల నుంచి చాలా మంది ప్లేయర్లు బయో బబుల్స్‌‌లో, క్వారంటైన్స్‌‌లో ఉంటున్నారు. దీనివల్ల మెంటల్‌‌గా వాళ్లకు కొంచెం ఇబ్బంది కలగడం సహజమే. అయినా యూకే వెళ్లే ముందు ఇండియాలో బయో బబుల్‌‌లో ఎంటరయ్యేందుకు వాళ్లు సానుకూలంగానే ఉన్నారు. దీనివల్ల బీసీసీఐ ప్లేయర్లను ఒక బబుల్‌‌ నుంచి మరో బబుల్‌‌కు పంపించే ఏర్పాట్లు చేస్తుంది’ అని తెలిపారు. గతేడాది ఐపీఎల్‌‌ ముగిసిన వెంటనే  కోహ్లీసేన దుబాయ్‌‌ నుంచి ఆస్ట్రేలియాకు ఈజీగానే వెళ్లింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశం నుంచి యూకే వెళ్లేందుకు అనేక ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  కోహ్లీ అండ్‌‌ కోకు ఇంగ్లండ్‌‌లో కఠిన క్వారంటైన్‌‌ తప్పించేందుకు బోర్డు కృషి చేస్తోంది. 

ఇండియా-ఎ, ఐపీఎల్‌‌ యంగ్‌‌స్టర్స్‌‌కు  చాన్స్‌‌

ఇంగ్లండ్​ టూర్​కు ఎంపికైన ప్లేయర్లు శ్రీలంక సిరీస్​కు పూర్తిగా దూరంగా ఉండనున్నారు. ఈ అంశాన్ని బీసీసీఐ బాస్​ గంగూలీ కూడా కన్ఫామ్​ చేశాడు. దీంతో స్టార్​ ప్లేయర్లు విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, జస్​ప్రీత్​ బుమ్రా, రిషబ్​ పంత్​ తదితరులు ఈ సిరీస్​కు అందుబాటులో ఉండటం లేదు. అయితే, వైట్​బాల్​ స్పెషలిస్టులు, ఇంగ్లండ్​ సిరీస్​కు ఎంపికవ్వని శిఖర్​ ధవన్​, హార్దిక్​ పాండ్యా, భువనేశ్వర్​ కుమార్​ లంక టూర్​లో  కీలకం కానున్నారు. ఫిట్​నెస్​ సమస్యలతో బాధపడుతున్న కేఎల్​ రాహుల్​ ఒకవేళ ఇంగ్లండ్​ సిరీస్​కు దూరమైతే లంక టూర్​లో బరిలోకి దిగే అవకాశం ఉంది.  అయితే, విరాట్​, రోహిత్​ లేనిపక్షంలో జట్టును నడిపించేది ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. సీనియర్​ ప్లేయర్​, ఓపెనర్​ శిఖర్​ ధవన్​కు కెప్టెన్సీ అప్పగించే చాన్స్​ ఉందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఇక, టీమిండియా ప్లేస్​ కోసం పోటీపడుతున్న కుర్రాళ్లకు లంక సిరీస్​ ఓ అవకాశం కానుంది. ఎన్​సీఏ డైరెక్టర్​ రాహుల్​ ద్రవిడ్​ ఆధ్వర్యంలో ఇండియా–ఎకు ఆడుతున్న పలువురు యంగ్​స్టర్స్​తోపాటు ఐపీఎల్​తో వెలుగులోకి వచ్చిన కుర్రాళ్లు లంక సిరీస్ ద్వారా నేషనల్​ టీమ్​ నుంచి పిలుపు అందుకోనున్నారు. ధవన్​, భువనేశ్వర్​, హార్దిక్​ పాండ్యా , యుజ్వేంద్ర చహల్​ ఎంపిక ఖాయం కాగా, సంజూ శాంసన్​, పృథ్వీ షా, దీపక్​ చహర్​, రాహుల్​ చహర్​, జైదేవ్​ ఉనాద్కట్​, కుల్దీప్​ యాదవ్​, వరుణ్​ చక్రవర్తి, రాహుల్​ తెవాటియా తదితరులు సెలెక్షన్​ టేబుల్​ ముందుకు వచ్చే చాన్సుంది.