టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో పెళ్ళికి సిద్ధమైనట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో (వచ్చే నెలలో) తన ఐరిష్ స్నేహితురాలు సోఫీ షైన్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. వీరి వివాహం ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో జరగనుందని టాక్. శిఖర్ ధావన్ లేదా అతని స్నేహితురాలు సోఫీ షైన్ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరి 14-15 తేదీలలో ధావన్- సోఫీ షైన్ వివాహం జరగనుంది. పెళ్ళికి ప్రపంచ క్రికెటర్లతో పాటు పాటు బాలీవుడ్‌కు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ధావన్- సోఫీ షైన్ తొలిసారి కనిపించారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తమ రిలేషన్ ను వారు ఎవరికీ తెలియనివ్వలేదు.
సోఫీ షైన్ ఎవరు?
సోఫీ షైన్ 1990లో జన్మించారు. ఆమె ఐరిష్ జాతీయురాలు. ఆమె లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని సంపాదించింది. సోఫీ ఐర్లాండ్‌లోని కాజిల్‌రాయ్ కాలేజీలో తన డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం శిఖర్ ధావన్ ఫౌండేషన్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. గత ఏడాది జూన్‌లో దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకున్న ధావన్- సోఫీ షైన్ జంట కొన్ని నెలల పాటు రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. తన కార్పొరేట్ కెరీర్‌తో పాటు, ఆమె శిఖర్ ధావన్ ఫౌండేషన్‌లో కూడా చురుకుగా పాల్గొంటుంది. అంతేకాదు వివిధ సామాజిక కార్యక్రమాలలో ధావన్‌తో కలిసి పనిచేస్తుంది.
ఆయేషా ముఖర్జీతో విడాకులు:
ధావన్ గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఇప్పుడు జోరావర్ అనే 11 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ విడిపోవడంతో ఇప్పుడు ధావన్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బెంగాల్‌లో పుట్టి మెల్‌బోర్న్‌లో సెటిల్ అయిన మాజీ కిక్ బాక్సర్ అయేషాను ధావన్ 2012లో పెళ్లి చేసుకున్నాడు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ద్వారా ఆమెతో ధావన్ కు పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆసీస్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌కు విడాకులు ఇచ్చిన ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైగా, వయసులో తనకంటే11 ఏళ్లు పెద్దదైన ఆయేషాతో శిఖర్ ప్రేమలో పడ్డాడు. 2014లో వీరిద్దరికీ కొడుకు జొరావర్ పుట్టాడు.
పెళ్లయినప్పటి నుంచి ఈ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించేవాళ్లు. అయేషా మొదటి భర్త పిల్లలు అలియా, రియాను ధావన్ దత్తత తీసుకున్నాడు. వాళ్లను ఎంతో ప్రేమగా చూసేవాడు. అందరినీ తనతో పాటు మ్యాచ్‌లు, ఫారిన్ టూర్స్‌కు తీసుకెళ్లేవాడు. అలాగే, భార్యతో కలిసి వర్కౌట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. అలాంటి జంట విడిపోవడం అందరికీ షాక్ కలిగించే విషయం.
ఓపెనర్ గా టీమిండియాలో మార్క్:
2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గబ్బర్.. డిసెంబర్ 2022లో చివరిసారి భారత జట్టులో కనిపించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన అద్భుత ఆటతీరుతో ఆనతీ కాలంలోనే మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత జట్టు తరఫున 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడిన ధావన్.. వరుసగా వన్డేల్లో 6793, టెస్టుల్లో 2315, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు ధావన్ ఖాతాలో ఉన్నాయి.
