
అధిక వడ్డీలు, పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన శిల్పా చౌదరిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. శిల్పా చౌదరిపై ఇప్పటి వరకు 5 కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఫస్ట్ టైం రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీలో శిల్పా చౌదరి నోరు విప్పకపోవటంతో... సెకండ్ టైం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు నార్సింగి పోలీసులు. రెండో సారి మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించటంతో... విచారణను కొనసాగిస్తున్నారు పోలీసులు.
వడ్డీలతో పాటు పెట్టుబడుల పేరుతో ఎంత మంది దగ్గర డబ్బు తీసుకుందనే విషయంపై విచారిస్తున్నారు పోలీసులు. అయితే రాధిక రెడ్డికి డబ్బులిచ్చానని శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో నార్సింగ్ పోలీసుల ముందు హాజరైన రాధిక రెడ్డి.. శిల్పా చౌదరి తనకెలాంటి మనీ ఇవ్వలదని చెప్పింది. మరోవైపు నిన్నటి విచారణలో కొంపల్లి మల్లారెడ్డి, ప్రతాప్ రెడ్డి పేర్లు కూడా పోలీసులకు శిల్పా చౌదరి చెప్పినట్లు తెలుస్తోంది. శిల్పా చౌదరి దంపతుల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు శిల్పా చౌదరి బాధితులు స్టేషన్ కు క్యూ కడుతున్నారు. తమ దగ్గర డబ్బులు తీసుకుందంటూ వరుసగా పీఎస్ కు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు బాధితులు. బాధితుల్లో ఎక్కువగా వ్యాపారస్తులు, సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. శిల్పా బాధితుల్లో ఎక్కువగా సినిమా వాళ్లే ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 18 మంది వీఐపీలు శిల్ప చేతిలో మోసపోయారని.. తమ పరువు పోతుందని భావించి బయటకు రావడంలేదని తెలుస్తోంది. ఇప్పటికే శిల్పపై హీరో మహేష్ బాబు సోదరి ఫిర్యాదు చేసింది.