60 కోట్ల స్కామ్.. చిక్కులో శిల్పా శెట్టి.. మూసేస్తున్న ముంబై రెస్టారెంట్..

60 కోట్ల స్కామ్.. చిక్కులో శిల్పా శెట్టి.. మూసేస్తున్న ముంబై రెస్టారెంట్..

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై రూ. 60 కోట్లకు పైగా మోసం కేసు నడుస్తుండగా, శిల్పా శెట్టి ఒక పెద్ద ప్రకటన చేసింది. ముంబైలోని బాంద్రాలో నడుస్తున్న  బాస్టియన్ రెస్టారెంట్ మూసేస్తున్నట్లు తెలిపారు. దింతో గురువారం మా బాస్టియన్ రెస్టారెంట్ చివరి రోజు అని,  సోషల్ మీడియాలో రెస్టారెంట్ గురించి ఒక పోస్ట్ చేసారు.

 రెస్టారెంట్ కి వీడ్కోలు :  శిల్పా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ముంబైలోని తన రెస్టారెంట్ 'బాస్టియన్ బాంద్రా'  మూసివేయబోతున్నట్లు, ఈ గురువారం రెస్టారెంట్ కి చివరి రోజు అలాగే ఈ గురువారంతో ఒక శకం ముగియబోతోందన్నారు. ముంబైలోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటైన బాస్టియన్ బాంద్రా ఇప్పుడు వీడ్కోలు పలుకుతోంది. ఈ ప్రదేశం మనకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చింది అని చెబుతూ, రెస్టారెంట్‌ను మూసివేయడానికి గల కారణాన్ని పేర్కొనలేదు. 

శిల్పా శెట్టి అలాగే వ్యాపారవేత్త రంజిత్ బింద్రా కలిసి బాస్టియన్ రెస్టారెంట్ ను 2016లో ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ సముద్ర ఆహారం(sea food)  ప్రియులకు ఇష్టమైన ప్రదేశం. ఈ రెస్టారెంట్‌ను 2023లో బాంద్రాకు మార్చారు. 

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై  కేసు : ఆర్థిక నేరాల విభాగం (EOW) శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై మోసం కేసు నమోదు చేసింది. ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని విస్తరించే పేరుతో 2015 నుంచి 2023 మధ్య రూ. 60.4 కోట్లు మోసం చేశారని కొఠారి ఆరోపించారు. అలాగే పెట్టుబడి పెట్టిన డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని ఆయన తెలిపారు.

ఈ ఆరోపణలను శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఖండించారు. ఇది క్రిమినల్ కేసు కాదని, కేవలం సివిల్ వివాదం అని వారి న్యాయవాదులు చెప్పారు. ఈ విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) అక్టోబర్ 4 2024న తీర్పు ఇచ్చింది.

కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుందని న్యాయవాదులు తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి నేరం లేదని స్పష్టం చేశారు. కంపెనీకి సంబంధించిన అన్ని పేపర్స్, క్యాష్ ట్రాన్సక్షన్ వివరాలను EOWకి అందించామని చెప్పారు. ఈ డీల్  ఒక పెట్టుబడి మాత్రమే అని, కంపెనీ ఇప్పటికే మూతపడిందని కూడా తెలిపారు.