భారత్ సంస్కృతి, సంప్రదాయాలంటే అబేకు ఎంతో ఇష్టం

భారత్ సంస్కృతి, సంప్రదాయాలంటే అబేకు ఎంతో ఇష్టం

న్యూఢిల్లీ: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేకు మన దేశం అంటే ఎనలేని అభిమానం. తాను ప్రధానిగా బాధ్యతలు చేట్టాక ఇండియాతో సన్నిహితంగా మెలిగారు. యూపీఏ హయాంలోనైనా, ఎన్డీయే హయాంలోనైనా అన్ని విషయాల్లో మనకు సహకారించారు. మోడీ, అబే మంచి మిత్రులు. ‘అత్యంత ప్రియమైన స్నేహితుడ్ని కోల్పోయాను’ అంటూ అబే మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని మోడీ ట్విట్టర్​లో సంతాపం వెలిబుచ్చారు. 1957 నుంచే అబే కుటుంబానికి ఇండియాతో అనుబంధం ఉంది. ఆయన ప్రధాని అయిన తర్వాత మరింత బలపడింది. 

గంగా హారతిలో పాల్గొని..

మన ప్రధాని నరేంద్రమోడీ, షింజే అబే మంచి మిత్రులు. మోడీ గుజరాత్​ సీఎంగా ఉన్నప్పుడే అబేతో స్నేహం ఏర్పడింది. ప్రధాని అయ్యాక.. ఆ స్నేహం మరింత బలపడింది. 2015లో షింజో అబే భారత పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మోడీ ఆయనను వారణాసికి తీసుకెళ్లి ఇద్దరూ గంగా హారతిలో పాల్గొన్నారు. ఇక్కడి సంస్కృతి అన్నా.. సంప్రదాయాలన్నా అబేకు చాలా ఇష్టం. ఆ తర్వాత రెండేండ్లకు మళ్లీ ఇండియాకు వచ్చిన ఆయన అహ్మదాబాద్​లో బుల్లెట్​ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2021లో కేంద్ర ప్రభుత్వం షింజో అబేను పద్మవిభూషణ్​తో సత్కరించింది.

నేడు జాతీయ సంతాపం దినం

ఇండియాతో షింజో అబేకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ శనివారం జాతీయ సంతాప దినంగా పాటించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. సోనియా గాంధీ, రాహుల్ ​ట్విట్టర్​లో సంతాపం వెలిబుచ్చారు.