మహారాష్ట్రలో పంపకాలైనయ్‌‌ ఇలా!

మహారాష్ట్రలో పంపకాలైనయ్‌‌ ఇలా!

శివసేన 15
ఎన్సీపీ 15
కాంగ్రెస్ 13

ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్​కు స్పీకర్ పోస్టు
అసెంబ్లీలో ప్రమాణం చేసిన 285 మంది ఎమ్మెల్యేలు
ఆత్మీయ ఆలింగనంతో అజిత్​ను ఆహ్వానించిన ఎంపీ సుప్రియా సూలె
నేడు శివాజీ పార్క్​లో ఉద్ధవ్ ప్రమాణం.. తర్వాత కేబినెట్ భేటీ
30న స్పీకర్ ఎన్నికకు అవకాశం

ముంబై: మహారాష్ట్ర లో కొత్తగా ఏర్పాటు కానున్న ‘మహారాష్ర్ట వికాస్ ఆగాధీ’ ప్రభుత్వంలో మంత్రి పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. శివసేన, ఎన్సీపీ సమానంగా 15 పోస్టులు దక్కించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్​కు 13 పోస్టులు దక్కనున్నట్లు తెలిసింది. మహారాష్ర్ట అసెంబ్లీలో మొత్తం 288 మంది సభ్యులు ఉండగా.. అందులో 15 శాతానికి మించి మంత్రి పదవులు ఉండటానికి వీలు లేదు. అంటే గరిష్ఠంగా సీఎంతో కలిపి 43 మంది మంత్రులు ఉండొచ్చు. ఆ మేరకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు మంత్రి పదవులను కేటాయించినట్లు తెలిసింది. శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కగా, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్​కు 13 మంత్రి పదవులతోపాటు స్పీకర్ పదవి కూడా దక్కింది. ఈ పదవుల పంపకంపై మూడు పార్టీలు అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. అలాగే ఐదేళ్లు ఉద్ధవే ముఖ్యమంత్రిగా ఉండేందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. వైబీ చవాన్‌‌‌‌ భవన్‌‌‌‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మీటింగ్​లో శివసేన చీఫ్‌‌‌‌ ఉద్ధవ్‌‌‌‌ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌‌‌‌ పవార్‌‌‌‌లతో పాటు కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నాయకులు అహ్మద్‌‌‌‌ పటేల్‌‌‌‌, మాణిక్‌‌‌‌రావ్‌‌‌‌ థాక్రే తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

285 మంది ఎమ్మెల్యేల ప్రమాణం

మహారాష్ర్ట 14వ లెజిస్లేటివ్ అసెంబ్లీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. 285 మంది ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ కాళిదాస్ కోలంబకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. 288 మంది సభ్యులు ఉన్న శాసనసభలో బీజేపీ సభ్యులు దేవేంద్ర ఫడ్నవీస్, సుధీర్ ముంగంటివార్ ప్రమాణం చేయలేదని విధాన్ భవన్ అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత వచ్చిన మజ్లిస్ సభ్యుడు మొహమ్మద్ ఇస్మాయిల్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మహాశ్ బల్డిలతో స్పీకర్ చాంబర్​లో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా ఉద్ధవ్ ఎన్నిక తర్వాత కేబినెట్ మీటింగ్ జరుగుతుందని, స్పీకర్ ఎన్నిక అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని శాసనసభ సెక్రెటరీ రాజేంద్ర భాగవత్ తెలిపారు. ఈనెల 30న స్పీకర్ ఎన్నిక ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

ఎవరెవర్ని ఆహ్వానించారంటే..

‘మహా వికాస్‌‌‌‌ ఆగాధి’ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఉద్ధవ్‌‌‌‌ థాక్రే గురువారం సెంట్రల్​ముంబైలోని దాదర్​శివాజీ పార్క్​లో సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌‌‌‌ పార్టీ చీఫ్ సోనియా గాంధీని ఆహ్వానించినట్టు శివసేన నేత ఏక్​నాథ్​షిండే చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌‌‌‌ను ఆహ్వానించినట్టు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని తమ ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు ఎన్సీపీ నేత అజిత్‌‌‌‌ పవార్‌‌‌‌ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌‌‌‌ షాలను కూడా ఆహ్వానిస్తామని సంజయ్‌‌‌‌ రౌత్‌‌‌‌ తెలిపారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను కూడా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉద్ధవ్‌‌‌‌ థాక్రే ఆహ్వానించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్‌‌‌‌ థాక్రేకూ ఆహ్వానం పంపారు.

సెక్యూరిటీ కట్టుదిట్టం

ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గట్టి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. సెక్యూరిటీ ఏర్పాట్లపై సీనియర్ పోలీస్ అధికారులు బుధవారం రివ్యూచేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులతోపాటు వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ప్రోగ్రామ్ సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పార్క్ దగ్గర డ్రోన్లు, సీసీటీవీలు వాడుతున్నట్టు చెప్పారు.

శివసేనకు పవిత్ర స్థలం

శివసేన కార్యకర్తలకు శివాజీ పార్క్​తో విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీని స్థాపించిన బాల్ థాక్రే ఈ పార్క్ నుంచే దసరా సభల్లో మాట్లాడేవారు. ఆయన చనిపోయిన తర్వాత బాల్​థాక్రే కొడుకు ఉద్ధవ్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. బాల్​థాక్రే అంత్యక్రియలు కూడా ఇదే పార్క్​లో జరిగాయి. ఈ ప్రదేశాన్ని ‘శివతీర్థం’గా శివసేన కార్యకర్తలు పిలుస్తారు. ఇది సేన కార్యకర్తలకు పవిత్రస్థలం.

శివాజీ పార్క్ సెక్యూరిటీపై హైకోర్ట్ ఆందోళన

మహా సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్న శివాజీ పార్కు దగ్గర సెక్యూరిటీ ఏర్పాటుపై బాంబే హైకోర్ట్ ఆందోళన వ్యక్తంచేసింది. పబ్లిక్ గ్రౌండ్‌‌‌‌లో తరచూ ఇలాంటి కార్యక్రమాలు జరపడం మంచిదికాదని కామెంట్ చేసింది. శివాజీ పార్క్ ప్లే గ్రౌండా లేక రిక్రియేషన్ గ్రౌండా చెప్పాలంటూ ‘వేకోమ్ ట్రస్ట్’ అనే ఎన్జీవో హైకోర్టులో పిటిషన్​వేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, జస్టిస్ ఆర్ఐ చాగ్లా బెంచ్.. ‘‘గురువారం జరిగే కార్యక్రమంపై మేం ఏమీ మాట్లాడదల్చుకోలేదు. అయితే అనుకోని సంఘటనలు జరగకూడదని మాత్రం కోరుకుంటున్నాం’’ అని పేర్కొంది. గతంలో శివాజీ పార్క్​ను ‘సైలెన్స్ జోన్’గా హైకోర్టు ప్రకటించింది.

ఢిల్లీలోనూ పాగా వేస్తామేమో: రౌత్

మహారాష్ట్రలో అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్ని క్రూర రాజకీయాలకు పాల్పడినా ప్రజలు దాన్ని తిప్పికొట్టారని శివసేన సీనియర్ లీడర్, ఎంసీ సంజయ్ రౌత్ చెప్పారు. దేశరాజకీయాల్లో మార్పుకు ఇదొక ప్రారంభమని అన్నారు. కేంద్రంలో కూడా శివసేన అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదని రౌత్ చెప్పారు.​ తాను యోధుణ్ని, శివసేన వర్కర్​ని మాత్రమేనని, చాణుక్యుణ్ని కాదని
అన్నారు.

అజిత్‌‌కు ఆత్మీయ స్వాగతం

నాటకీయ పరిణామాల మధ్య తిరిగి సొంతగూటికి చేరుకున్న అజిత్ పవార్​కు ఆయన చెల్లెలు సుప్రియా సూలె ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. మహారాష్ట్ర అసెంబ్లీ ముందు అన్నతో కలిసి చిరునవ్వుతో ఫొటోలకు పోజిచ్చారు. శనివారం చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ‘పార్టీతో పాటు కుటుంబమూ ముక్కలైంది’ అంటూ సుప్రియ వాట్సప్ స్టేటస్ పెట్టారు. శివసేన యువనేత ఆదిత్య థాక్రే బుగ్గను ఆప్యాయంగా నిమిరారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ను కూడా సూలె చిరునవ్వుతో పలకరించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘‘ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. అలాగే బాధ్యతాయుతమైన రోజు కూడా” అని ఆమె అన్నారు. ‘‘ఎన్సీపీలోనే ఉన్నానని ప్రతీసారి చెబుతూనే ఉన్నా. పార్టీని వీడిందే లేనప్పుడు ఇక తిరిగి రావడమనే ప్రశ్న ఎక్కడిది’’ అని అజిత్ పవార్ అన్నారు. ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేదని, సరైన సమయంలో మాట్లాడతానని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్సీపీని వీడలేదని.. ఇక ముందూ వీడబోయేదిలేదని స్పష్టం చేశారు.

పదవులు ఇలా..

శివసేన-సీఎం, 14 మంత్రులు 
ఎన్సీపీ- డిప్యూటీ సీఎం, 14 మంత్రులు
కాంగ్రెస్-స్పీకర్, 13 మంత్రులు

మరిన్ని వార్తల కోసం