ప్రశ్నిస్తే నోటీసులిస్తారా..?

 ప్రశ్నిస్తే నోటీసులిస్తారా..?

మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏక్ నాథ్ షిండేతో పాటు ఆయన అనుచర ఎమ్మెల్యేలు 50మంది వరకూ అస్సాంలోని గౌహతిలో ఉన్న రాడిసన్ హోటల్ లో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్ నాథ్ షిండే వర్గంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఎన్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లలో చాలామంది ఒకప్పుడు తమ పార్టీలోనే ఉండేవారని, శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు దీపక్ భౌ, ఉదయ్ సమంత్ ఎన్సీపీ యువజన విభాగంలో పని చేశారని చెప్పారు. ఇవాళ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించి.. తమను (ఎన్సీపీ) టార్గెట్ చేయడం చాలా బాధగా ఉందన్నారు. 

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే కు 144 మెజారిటీ లేదని, ఆయనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని ఎంపీ సుప్రియాసూలే అన్నారు. తాము సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా ఉంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి (బీజేపీ) వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నాయకులకు దర్యాప్తు సంస్థలతో (ED, CBI, NIA) నోటీసులు ఇప్పిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు దేశానికి, రాజ్యాంగానికి అంత మంచివి కావన్నారు. శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై సుప్రియా సూలే ఈ కామెంట్స్ చేశారు.