డిసెంబర్ 13న హైదరాబాద్‎కు మెస్సీ.. వెయిటింగ్ అంటూ సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

డిసెంబర్ 13న హైదరాబాద్‎కు మెస్సీ.. వెయిటింగ్ అంటూ సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌‌‌‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీని, అతని ఆటను నేరుగా చూసే భాగ్యం హైదరాబాద్‌‌‌‌అభిమానులకు దక్కనుంది. ‘గోట్‌‌‌‌టూర్ టు ఇండియా 2025’ పర్యటనలో భాగంగా 2025, డిసెంబర్‌‎లో మెస్సీ ఇండియాలో పర్యటించనున్నారు. ఈ పాన్ ఇండియా టూర్‌‎లో భాగంగా మెస్సీ కోల్‌‌‌‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో సందడి చేయనున్నాడు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 

ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన సీఎం రేవంత్.. 2025, డిసెంబర్ 13న హైదరాబాద్‌లో ఫుట్‎బాల్ దిగ్గజం మెస్సీకి స్వాగతం పలికి, ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. మా గడ్డపై మీలాంటి లెజెండ్‌ను చూడాలని కలలు కన్న ప్రతి ఫుట్‌బాల్ అభిమానికి ఇది ఒక ఉత్తేజకరమైన క్షణమని అన్నారు. మన ప్రజల ఉత్సాహం, స్పూర్తితో హైదరాబాద్ అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ALSO READ : కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే.. 

హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ డిసెంబర్ 13న రాత్రి 7–8.45 గంటల మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియం లేదా గచ్చిబౌలి ఫుట్‌‌‌‌బాల్ స్టేడియంలో ‘గోట్‌‌‌‌ కప్‌‌‌‌’ ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్‌‌‌‌ఆడనున్నాడు. అదే రోజు సాయంత్రం ఫ్యాన్స్‌‌‌‌, సెలెబ్రిటీలతో మీట్‌‌‌‌ అండ్ గ్రీట్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ ఉండనున్నట్లు సమాచారం.  హైదరాబాద్ లెగ్ కేవలం ఒక స్పోర్టింగ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ మాత్రమే కాకుండా, సౌతిండియా ఫ్యాన్స్‌‌‌‌ను ఉర్రూతలూగించే ఒక భారీ వేడుక కానుంది.

 ఇందులో సెలెబ్రిటీ మ్యాచ్, ఫుట్‌‌‌‌బాల్ క్లినిక్, సన్మానాలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. సౌతిండియా ఫిల్మ్‌‌‌‌ స్టార్స్‌‌‌‌ఈ ఈవెంట్‌‎కు అటెండ్ అవుతారు. 2025, డిసెంబర్‌‌‌‌‌‌‌‌12 రాత్రి మెస్సీ కోల్‌‌‌‌కతాకు చేరుకుంటారు. ఈ టూర్‌‎లో మెస్సీతో పాటు అతని టీమ్‌‌‌‌మేట్స్‌‌‌‌ లూయిస్ సురేజ్, రోడ్రిగో డిపాల్ కూడా పాల్గొంటారు.