ఈ గవర్నర్​ మాకొద్దు..

ఈ గవర్నర్​ మాకొద్దు..
  • మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన
  • ఆయన బీజేపీకిఅనుకూలంగా వ్యవహరిస్తున్నరు
  • శివసేన మౌత్ పీస్‘సామ్నా’లో ఎడిటోరియల్

ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని రీకాల్ చేయాలని రూలింగ్ పార్టీ శివసేన కేంద్రాన్ని డిమాండ్ చేసింది. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగాన్ని, చట్టాలను  కాపాడాలనుకుంటే కేంద్ర హోంశాఖ ఆయనను రీకాల్ చేయాలని పేర్కొంది. శివసేన అధికార పత్రిక సామ్నాలో శనివారం ఈ మేరకు ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. ‘‘గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ మళ్లీ వార్తల్లోకొచ్చారు. ఆయన చాలా ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ గా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాకే వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఎందుకు తరచూ కాంట్రవర్సీలకు కారణం అవుతున్నారనేది ప్రశ్నార్థకం అయింది. గవర్నర్ ఇటీవల డెహ్రాడూన్ కు ప్రైవేట్ టూర్ వెళ్లారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫ్లైట్ లో వెళ్లేందుకు అనుమతించలేదు. అయినా ఆయన ఫ్లైట్ లో ఎక్కి కూర్చున్నారు. గవర్నర్ మాత్రమే కాదు సీఎం కూడా సొంత టూర్లకు ప్రభుత్వ ఫ్లైట్ ను వాడుకోవద్దు” అని ఎడిటోరియల్ లో శివసేన వివరించింది. ‘‘రాష్ట్రంలోని మహా వికాస్ అగాధీ ప్రభుత్వం బలంగా, స్థిరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు” అని చెప్పింది. గవర్నర్ ప్రభుత్వ ఎజెండాను కొనసాగించాలి కానీ ప్రతిపక్ష ఎజెండాను కాదని విమర్శించింది.