
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఆ పార్టీ ఎంపీలు కోరారు. దీనిపై రెండు రోజుల్లో తన నిర్ణయం చెప్తానని ఠాక్రే చెప్పినట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీలతో ఠాక్రే సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 16మంది ఎంపీలు హాజరయ్యారు. శివసేనకు మొత్తం 19 మంది లోక్ సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో ఏక్ నాథ్ షిండే కొడుకు సహా ఐదుగురు షిండేకు మద్ధతు ఇస్తున్నారు. మహారాష్ట్రలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందువల్ల..రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇద్దామని ఠాక్రేను ఎంపీలు కోరారు.
ఏక్ నాథ్ షిండే ఎపిసోడ్ తర్వాత పార్టీపై పట్టు సాధించేందుకు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఎంపీలతో సమావేశమయ్యారు. కాగా ఎంపీల నిర్ణయానికి ఆయన సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం అయ్యాక ఉద్ధవ్ సన్నిహితుడైన సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లడం గమనార్హం. సంజయ్ రౌత్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.