ఇక్కడ మరో దుష్యంత్ లేడు: బీజేపీకి శివసేన వార్నింగ్

ఇక్కడ మరో దుష్యంత్ లేడు: బీజేపీకి శివసేన వార్నింగ్
  • మహారాష్ట్రలో కొనసాగుతున్న సస్పెన్స్

ముంబై: ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు రోజులవుతున్నా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 50:50 ఫార్ములాపై శివసన పట్టువీడకపోవడంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఉద్ధవ్ దిగిరాకపోతే.. ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది.

ఇక్కడ ఎవరి తండ్రీ జైళ్లలో లేరు..

శివసేన ఎంపీ సంజయ్ రౌత్

హర్యానాను ప్రస్తావిస్తూ ‘మహారాష్ట్రలో మరో దుష్యంత్ చౌతాలా మీకు దొరకడు’ అంటూ జేజేపీతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవడాన్ని ఎద్దేవా చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా జైలులో ఉన్నాడని, అలా ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు. మహారాష్ట్రలో సత్యం, ధర్మంతో కూడిన రాజకీయాలు నడుస్తాయన్నారాయన. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎప్పటికీ బీజేపీతో కలవడమనేది జరగదని సంజయ్ చెప్పారు.

అధికారానికి దూరంగా పెట్టినా గర్విస్తాం

తమను అధికారానికి దూరంగా పెట్టాలని చూసినా దాన్ని శివసేన గర్వంగా ఫీలవుతుందని ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ముందుగా ఒప్పందం కుదిరిన దాని ప్రకారమే 50:50 ఫార్ములాపై డిమాండ్ చేస్తున్నామని చెప్పారాయన. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.