శివాజీ మాకు ఆదర్శం…నేషనలిజమే ఊపిరి : మోడీ

శివాజీ మాకు ఆదర్శం…నేషనలిజమే ఊపిరి :  మోడీ

సావర్కర్​పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఫైర్​
జనం బుద్దిచెప్పినా కాంగ్రెస్​, ఎన్సీపీ మారట్లేదని విసుర్లు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ

సతారా, పార్లీ, పుణె(మహారాష్ట్ర): ఎన్డీఏ ప్రభుత్వాలకు నేషనలిజం, నేషనల్​ సెక్యూరిటీ అంశాలే ఫస్ట్​ ప్రయారిటీ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ విషయంలో తాము ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుంటామని, అదే స్ఫూర్తితో దేశ ఐక్యతను దెబ్బతీసేవాళ్లకు గట్టిగా బుద్ధిచెబుతామని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన మూడు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడారు. మహారాష్ట్రలోని సతార్​ ‘గురు భూమి’అని, తన గురువు లక్ష్మణ్​ ఇనాందార్​ ఈ ప్రాంతానికి చెందినవారేనని ప్రధాని  గుర్తు చేసుకున్నారు.‘‘ఐదేండ్లుగా కేంద్రం, మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వాలు శివాజీ నెలకొల్పిన విలువల్ని పాటిస్తూవచ్చాయి. ఆయనను అనుసరిస్తూ, దేశ సమైక్యతకోసం మేం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లోక్​సభ ఎన్నికల ఫలితాలతో వాళ్లింకా గుణపాఠం నేర్చుకున్నట్లు లేరు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలే ఆ పార్టీలకు బుద్ధి చెబుతారు”అని మోడీ అన్నారు.

వీరుల్ని అవమానిస్తారా

దేశం కోసం ఎన్డీఏ తీసుకుంటోన్న నిర్ణయాలపై తప్పుడు ప్రచారం చేస్తోన్న ప్రతిపక్షాలు తద్వారా వీరుల్ని కూడా అవమానిస్తున్నాయని మోడీ ఆరోపించారు. ‘‘అప్పట్లో రాఫెల్​ డీల్​పై ఫాల్స్ ప్రాపగండా చేశారు. ఈమధ్య ఆర్టికల్​ 370 రద్దుపై అడ్డగోలుగా మాట్లాడి సైనిక కుటుంబాల గుండెల్ని గాయపర్చారు. వీలుచిక్కినప్పుడల్లా వీర్​సావర్కర్ లాంటి వీరులపైనా విషం కక్కారు”అని ప్రధాని విమర్శించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్​, ఎన్సీపీ కూటమిలో కుర్చీల కోసం కొట్లాట జరుగుతోందని, గాలి ఎటు వీస్తుందో గుర్తించారు కాబట్టే ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​ లోక్​సభ ఎన్నికల్లో పోటీచేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్​ అవుతాయని మోడీ చెప్పారు.

దేశచరిత్రను తిరగరాయాలి: అమిత్​ షా

వారణాసి: హిందూత్వ సిద్ధాంతకర్త వీర్​ సావర్కర్​ పేరును భారతరత్న అవార్డుకు మరోసారి ప్రతిపాదించడంపై ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ చీఫ్​, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా గట్టిగా కౌంటరిచ్చారు. సావర్కర్​ కృషి వల్లే  దేశ స్వాతంత్ర్య పోరాటంలో తొలి సంగ్రామమైన ‘1857 సిపాయిల తిరుగుబాటు’ వెలుగులోకి వచ్చిందని, సావర్కరే లేకుంటే 1857 తిరుగుబాటును మనం ఇప్పటికీ బ్రిటిషర్ల యాంగిల్​లోనే చూసుండేవాళ్లమని, అదొక చరిత్రగా రికార్డయ్యేది కాదని షా తెలిపారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో గురువారం జరిగిన సెమినార్​లో మాట్లాడిన ఆయన.. చరిత్ర మొత్తాన్ని ఇండియా కోణంలో తిరగరాయాల్సిన అవసరం ఉందన్నారు. పండిట్​ మదన్​ మోహన్​ మాలవీయ స్థాపించిన బెనారస్​ వర్సిటీ హిందూ కల్చర్​ని కాపాడటానికి  కృషిచేస్తోన్నదని షా కొనియాడారు.