CSK vs GT: దూబే,రచీన్ విధ్వంసం.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే..?

CSK vs GT: దూబే,రచీన్ విధ్వంసం.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా  సీజన్ ఆరంభించి అంచనాలకు మించి ఆడుతుంది. బెంగళూరుపై తొలి గెలుపు నమోదు చేసుకున్న చెన్నై.. రెండో మ్యాచ్ లో విధ్వంసకర ఆట తీరుతో భారీ స్కోర్ చేసింది. గుజరాత్ టైటాన్స్ తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శివమ్ దూబే 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రచీన్ రవీంద్ర (46) మెరుపులు మెరిపించగా గైక్వాడ్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.     

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై తొలి వికెట్ కు ఓపెనర్లు గైక్వాడ్, రచీన్ రవీంద్ర మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఓ వైపు గైక్వాడ్ నెమ్మదిగా ఆడుతుంటే రచీన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 20 బంతుల్లోనే 46 పరుగులు చేసి చెన్నైకు సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత అజింక్య రహానే 12 పరుగులకే ఔటైనా.. గైక్వాడ్(46)తో కలిసి దూబే శివాలెత్తాడు. తొలి బంతి నుంచే బౌండరీల మోత మోగించాడు.

ఎదర్కొన్న తొలి రెండు బంతులకు సిక్సర్లుగా మలిచిన దూబే 23 బంతుల్లోనే 5 సిక్సులు, 2 ఫోర్లతో 51 పరుగులు చేసి చెన్నై భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో యువ ఆటగాడు సమీర్ రిజ్వి (6 బంతుల్లో 14) 2 సిక్సర్లు కొట్టడంతో జట్టు స్కోర్ 200 మార్క్ కు చేరుకుంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా.. సాయి కిషోర్, జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.