మహాశివరాత్రి : కీసర గుట్టలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రి : కీసర గుట్టలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

ఈ నెల 4వ తేదీన జరుగనున్న మహాశివరాత్రి వేడుకలకు కీసరగుట్ట ఆలయం ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న శైవక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్దిగాంచిన కేసరిగిరి (కీసరగుట్ట)లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు ( 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు) నిర్వహించే ఈ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శివకల్యాణోత్సవాలు, కుంకుమార్చనలు, జాగరణలు, సాంస్కృతిక, ఆధ్మాత్మిక వేడులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న కీసర శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనానికి ఈ దఫా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం కొండపై వసతులు కల్పించామని తెలిపారు అధికారులు.

బ్రహ్మోత్సవాల రోజువారీ వివరాలు

– 2వ తేదీన శనివారం ఉదయం 11 గంటల నుండి విఘ్నేశ్వరపూజ, పూణ్యాహవచనం, ఋత్విక్ వరణం, యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతిష్ఠాపనం, సాయంత్రం 4గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థ ప్రసాద వినియోగం, రాత్రి 8 గంటలకు శ్రీ స్వామి వారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేయుట.

-3వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రుద్రస్వాహాకర హోమం, సాయంత్రం 4 గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7 గంటలకు ప్రదోషకాలపూజ, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థప్రసాద వినియోగం , రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామి వారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేయుట, రాత్రి 10 గంటలకు పూర్వాషాడ నక్షత్రయుక్త కన్య లగ్న మందు శ్రీ భవానీ శివ దుర్గా సమేత రామలింగేశ్వరస్వామివార్ల కల్యాణ మహోత్సవం.

-4వ తేదీ సోమవారం మహాశివరాత్రి పర్వదినం,ఉదయం 4గంటల నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 6 గంటల నుంచి సామూహిక అభిషేకం (కల్యాణమండపంలో), ఉదయం 9గంటలకు రుద్రస్వాహకార హోమం, రాత్రి 10గంటలకు భజనలు, రాత్రి 12 గంటల నుంచి శ్రీ రామలింగేశ్వరస్వామివారికి సంతతధారాభిషేకం.

-5వ తేదీ మంగళవారం ఉదయం 5.30గంటల నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 6 గంటల నుంచి సామూహిక అభిషేకం, ఉదయం 9 గంటలకు రుద్రస్వాహకార హోమం, రాత్రి 7గంటల నుంచి ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు శ్రీ స్వామివారి విమాన రథోత్సవం,

-6వ తేదీ బుధవారం ఉదయం 5.30గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఉదయం 8గంటలకు అన్నాభిషేకం, రాత్రి 7గంటల నుంచి ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 8 గంటలకు వసంతోత్సవం పుష్పయాగం.

-7వ తేదీ గురువారం ఉదయం 5.30 గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఉదయం 7గంటల నుంచి సామూహిక అభిషేకం, ఉదయం 10 గంటలకు క్షేత్రదిగ్భలి, మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి, ఉత్సవ సమాప్తి, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగియనున్నాయి.