మహాశివరాత్రి రోజున సామూహిక వివాహాలు

మహాశివరాత్రి రోజున సామూహిక వివాహాలు

మహాశివరాత్రి రోజున సామూహిక వివాహాలు జరిపిస్తారు ఈ ఊర్లో . దాదాపు యాభై ఏండ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది ఈ సంప్రదాయం. ఊరి పేరు మహాగాం. పేదవాళ్ల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పెండ్లి చేస్తున్న ఆ ఊరి గురించి.  

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని  సిర్పూర్​ మండలంలో ఉంది ఈ ఊరు. ఇక్కడ సామూహిక వివాహాల ఆచారం ఎలా మొదలైందంటే...  ఒకప్పుడు మహాగాం ఊర్లో  సంత్​ సూరోజీ మహారాజ్​ అనే  సన్యాసి ఉండేవాడు. పదిమందికీ మంచి చేయాలని, మద్యం, మాంసం ముట్టొద్దని చెప్తుండేవాడు. సూరోజీ చనిపోయాక ఆయన భక్తులు గుడి, ఆశ్రమం కట్టించారు. ఆయన చెప్పినట్టుగానే పదిమందికీ సాయం చేయాలి అనుకున్నారు. అలా 1970 నుంచి ప్రతి ఏడాది శివరాత్రికి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు ఇక్కడ.  ఈ  శివరాత్రికి కూడా12 జంటలు వివాహం చేసుకోబోతున్నాయి. పెండ్లి చేసుకునే జంటలు ఐదు వేల రూపాయల ఫీజు కట్టాలి. అంత డబ్బు లేకుంటే తక్కువ ఫీజు కట్టొచ్చు. అదే పేదవాళ్లు అయితే డబ్బు కట్టకున్నా పర్లేదు. సూరోజీ శిష్యులు డబ్బు సాయం చేసి పెండ్లిండ్లు జరిపిస్తారు.  పెండ్లికొడుకు, పెండ్లికూతురికి  కొత్త బట్టలు, తాళి బొట్టు, వాళ్ల బంధువులకి భోజన ఏర్పాట్లు.. ఇలా పెండ్లి ఖర్చు మొత్తం సూరోజీ సేవాశ్రమం భరిస్తుంది. 

నాలుగొందలకు  పైగా...
మహాగాంలోఉన్న జనాభాలో  సగానికి పైగా  శివరాత్రి రోజు సామూహిక వివాహ వేదిక మీద పెండ్లి చేసుకున్నవాళ్లే. 50 ఏండ్లుగా దాదాపు400లకు పైగా జంటలు  పెండ్లి చేసుకున్నారు. సూరోజీ మహారాజ్ చూపిన బాటలో నడుస్తూ, పదిమందికీ సాయం  చేస్తున్నాం అంటున్నారు మహాగాం ఊరి పెద్దలు.   

ఇక్కడ పెండ్లి అదృష్టం
సంత్​సూరోజీ మహారాజ్​ ఆశ్రమంలో పెండ్లి చేసుకోవడం అదృష్టం అనుకుంటారు ఇక్కడివాళ్లు. వాళ్ల కులం కట్టుబాట్ల ప్రకారం పెండ్లిండ్లు చేస్తాం. ఇక్కడ పెండ్లి చేసుకున్న ఒక్క జంట కూడా విడిపోలేదు. 
- కైలాష్ గురూజీ , మహాగాం పూజారి

:: మసాదే సంతోష్ కుమార్, ఆసిఫాబాద్, వెలుగు