కొన్ని కథలు మనం అనుకున్నట్టుగా మొదలవ్వవు. కొన్ని అవకాశాలు అనుకోకుండా ఎదురొస్తాయి. శోభినవ్ సత్యా నటనా ప్రయాణం కూడా అలాంటిదే. కథానాయకుడిగా తెరపై కనిపించాలనే లక్ష్యంతో ఆయన సినిమా సెట్లో అడుగుపెట్టలేదు.
కెమెరా వెనుక ఉండి సినిమాను నడిపించే అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చారు. కానీ దర్శకుడి దృష్టి ఆయనలోని మరో కోణాన్ని గుర్తించింది. ఒక స్క్రీన్ టెస్ట్.. ఐదు గంటల పరీక్ష.. ఆ తర్వాత జీవితాన్ని మార్చేసిన ఓ పాత్ర. ‘హనుమాన్ అంష్’లో కరోలి బాబాగా తెరపై కనిపించిన సత్యా.. ఒక్క సినిమాతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా ఖైరాబాద్లో శోభినవ్ జన్మించారు. తండ్రి ఉద్యోగ బదిలీతో ఏడో తరగతి తర్వాత లక్నోకు వెళ్లారు. అక్కడే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. లక్నో యూనివర్సిటీలో చేరినప్పటికీ అక్కడ ఎక్కువకాలం కొనసాగలేదు. ఆ తర్వాత ఫైజాబాద్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు.
అయితే చదువుతో పాటు ఆయన మనసు మాత్రం కళల వైపే పరుగులు తీసేది. నటనపై ఉన్న ఆసక్తితో లక్నోలోని ఒప్యులెంట్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్స్‌లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత అదే సంస్థలో నటన బోధించే ఉపాధ్యాయుడిగా, కౌన్సెలర్‌గా, మార్కెటింగ్ విభాగంలోనూ పనిచేశారు.
కెమెరా వెనుక మొదలైన ప్రయాణం
నటుడిగా మారే ముందు సినిమా మేకింగ్‌ను లోతుగా అర్థం చేసుకోవాలనుకున్నారు శోభినవ్. అందుకే పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందారు. అక్కడ నటనతో పాటు చిత్ర నిర్మాణంలోని అనేక అంశాలను దగ్గరగా తెలుసుకున్నారు. ఆ అనుభవం ఆయనను నేరుగా కెమెరా ముందు కాకుండా కెమెరా వెనుకకు తీసుకెళ్లింది.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్క్రిప్ట్, కంటిన్యుటీ సూపర్వైజర్గా పనిచేశారు. టెలివిజన్, వెబ్‌సిరీస్‌లతోపాటు పలు ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. దాదాపు దశాబ్దంపాటు సినిమా సెట్లలో పనిచేస్తూ.. నటనతో పాటు కథ ఎలా పుడుతుంది? సన్నివేశం ఎలా రూపుదిద్దుకుంటుంది? నటుడు కెమెరా ముందు ఎలా స్పందించాలి? వంటి విషయాలను ప్రత్యక్షంగా నేర్చుకున్నారు.
ఓ రోజు.. అంతా మారిపోయింది
‘హనుమాన్ అంష్’ ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు కూడా కథానాయకుడిగా కాదు. సినిమా బృందంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. కానీ దర్శకుడు విశాల్ చతుర్వేది ఆయనలోని ఏదో ప్రత్యేకతను గమనించారు. ముఖంలో ఉన్న సహజత్వం, వ్యక్తిత్వంలో కనిపించే ప్రశాంతత.. ఒక ప్రత్యేకమైన పాత్రకు సరిపోతాయని భావించారు. అలా శోభినవ్కు స్క్రీన్ టెస్ట్ అవకాశం వచ్చింది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఆ పరీక్ష తర్వాత ఆయనకు నీమ్ కరోలి బాబా పాత్ర దక్కింది. కెమెరా వెనుక పనిచేస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా కెమెరా ముందున్న ప్రధాన పాత్రధారిగా మారిపోయారు.
నీమ్ కరోలి బాబాగా..
తొలి సినిమాలోనే ఒక ఆధ్యాత్మిక గురువు పాత్రను పోషించడం అంత సులభమైన విషయం కాదు. ‘హనుమాన్ అంష్’ కథ నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన ఓ బాలుడు.. ఆమెను తిరిగి కలుసుకోవాలనే తపనతో భగవంతుడి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఆ అన్వేషణ అతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్తుంది. బాల్యం నుంచి ఆధ్యాత్మిక గురువుగా ఎదిగే పాత్రలో శోభినవ్ కనిపించారు. ఒకే పాత్రలో వయసు, అనుభవం, భావోద్వేగాల్లో వచ్చే మార్పులను చూపించాల్సి రావడంతో ఇది ఆయనకు నటుడిగా పెద్ద సవాలే.
పాత్రకు ముందే పరిచయం
ఈ పాత్రకు శోభినవ్ వ్యక్తిగతంగా కూడా ఒక అనుబంధం ఉందని చెప్పారు. 2009లో తొలిసారి నీమ్ కరోలి బాబా గురించి తెలుసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి ఆయనకు సంబంధించిన కథలు, ఆధ్యాత్మిక భావనలను తెలుసుకుంటూ వచ్చానని తెలిపారు.
అందుకే తెరపై బాబా పాత్రను పోషించడం కేవలం నటనగా కాకుండా ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారింది. పాత్రకు వచ్చిన స్పందన విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కొందరు తన పాదాలను తాకేందుకు ప్రయత్నించిన సందర్భాల్లో.. తాను కేవలం ఆ పాత్రను పోషించిన వ్యక్తినేనని, బాబా విగ్రహం వద్దే నమస్కరించాలని చెప్పినట్లు తెలిపారు.
ఒక్క సినిమాతో వచ్చిన గుర్తింపు
ఆగస్టు 7న విడుదలైన ‘హనుమాన్ అంష్’ తొలుత భారీ స్థాయిలో విడుదల కాలేదు. అయితే ప్రేక్షకుల స్పందనతో సినిమా వసూళ్లు క్రమంగా పెరిగాయి. సినిమా విజయంతో పాటు శోభినవ్ సత్యా పేరు కూడా ప్రేక్షకుల్లో చర్చకు వచ్చింది. ఏళ్ల తరబడి కెమెరా వెనుక పనిచేసిన వ్యక్తి.. ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అది కూడా సాధారణ కథానాయకుడిగా కాదు. కోట్లాది మంది భక్తితో చూసే ఓ ఆధ్యాత్మిక వ్యక్తి పాత్రలో. సినిమా ప్రపంచంలో కొందరికి మొదటి అవకాశమే గుర్తింపును తెచ్చిపెడుతుంది.
మరికొందరు ఆ గుర్తింపు కోసం సంవత్సరాలపాటు ఎదురుచూస్తారు. శోభినవ్ సత్యా రెండో కోవకు చెందిన ప్రయాణాన్ని దాటి.. మొదటి సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. అయితే ఈ విజయం తన వ్యక్తిగత జీవితాన్ని మార్చకూడదనే ఆలోచనతో ఉన్నారు శోభినవ్. తన గురించి ఎక్కువగా ప్రజలకు తెలియకపోవడమే తనకు ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పేరు కంటే పని ముఖ్యమనే ఆలోచన ఆయన మాటల్లో కనిపిస్తుంది.
