మంత్రులు ఇన్​చార్జులుగా ఉన్న గ్రామాల్లో టీఆర్​ఎస్​ వెనుకంజ

మంత్రులు ఇన్​చార్జులుగా ఉన్న గ్రామాల్లో టీఆర్​ఎస్​ వెనుకంజ
  • మల్లారెడ్డికి అప్పగించిన ఊర్లలో బీజేపీకి 450 ఓట్ల ఆధిక్యం
  • తలసానికి ఇచ్చిన ప్రాంతాల్లో బీజేపీకి  497 ఓట్ల లీడ్​
  • జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, ప్రశాంత్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, 
  • ఎర్రబెల్లి ఇన్​చార్జులుగా ఉన్న చోటా అదే పరిస్థితి
  • కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​, గంగుల ఉన్నచోట టీఆర్ఎస్​కు మెజార్టీ 

నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓటర్లు షాక్​ ఇచ్చారు. వాళ్లు ఇన్​చార్జులుగా ఉన్న గ్రామాల్లో  టీఆర్​ఎస్​ కన్నా బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి.  బైపోల్​లో ఎలాగైనా గెలవాలని భావించిన టీఆర్ఎస్​ హైకమాండ్​.. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను 2,500 నుంచి 3వేల లోపు ఓటర్లు ఉన్న ఒక్కో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ల టైమ్​లోనే ఇన్​చార్జులుగా వేసింది.  సీఎం కేసీఆర్​ స్వయంగా లెంకలపల్లి బాధ్యతలు తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్​చార్జులుగా ఉన్న  ప్రతి గ్రామంలో బీజేపీపై మెజారిటీ సాధించాలని సీఎం ఆదేశించారు. ఇక్కడ సాధించబోయే మెజార్టీ ఆధారంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఉంటాయని హెచ్చరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలను సీరియస్​గా తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు సుమారు నెలపాటు వారికి అప్పగించిన గ్రామాల్లో తిష్టవేసి ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. దావత్​లు, స్కీములతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మంత్రి మల్లారెడ్డి ఓ అడుగు ముందుకేసి జనానికి మందు పోశారు. మంత్రి జగదీశ్​రెడ్డి లాంటివాళ్లయితే.. బీజేపీకి ఓట్లు వేస్తే పింఛన్లు ఆగిపోతాయని ప్రచారం చేశారు. తీరా చూస్తే పలువురు మంత్రులు ఇన్​చార్జ్​లుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకి లీడ్​రావడం చర్చనీయాంశమైంది. 

కొన్ని చోట్ల లీడ్​ వచ్చినా..!

మిగిలిన చోట్ల ఇతర మంత్రులకు లీడ్​ వచ్చినా చాలావరకు డబుల్​డిజిట్స్​ కే పరిమితమయ్యారు. మంత్రి కేటీఆర్ ఇన్​చార్జ్​గా ఉన్న గట్టుప్పల్ లో టీఆర్ఎస్ కు 65 ఓట్ల మెజార్టీ వచ్చింది. మంత్రి గంగుల కమలాకర్‌  ఇన్​చార్జ్​గా ఉన్న సంస్థాన్‌ నారాయణపురం ఎంపీటీసీ -2 స్థానంలో  బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌కు 66 ఓట్లు ఎక్కువ వచ్చా యి.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇన్​చార్జ్​గా ఉన్న కొరటికల్, దుబ్బ కాల్వ ఎంపీటీసీ పరిధిలో  టీఆర్ఎస్ కు 109 ఓట్ల మెజారిటీ వచ్చింది. మంత్రి సత్యవతి రాథోడ్ ఇన్​చార్జ్​గా ఉన్న  పోర్లగడ్డ ఎంపీటీ సీ స్థానంలో టీఆర్​ఎస్​కు 288 మెజారిటీ వచ్చింది.  మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇన్ చార్జ్​గా ఉన్న పసునూరు మండలంలో టీఆర్ఎస్ కు 332 ఓట్ల మెజార్టీ వచ్చింది. కేసీఆర్ ఇన్​చార్జ్​గా ఉన్న మర్రిగూడ మండలం లెంకలపల్లిలో టీఆర్ఎస్ 254 ఓట్ల మెజార్టీ సాధించింది. ఇక్కడ మొత్తం 2,927 ఓట్లకు గాను 1,795 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో టీఆర్ఎస్​కు  944, బీజేపీకి 690 ఓట్లు పడ్డాయి. హరీశ్​రావు ఇన్​చార్జ్​గా ఉన్న మర్రిగూడ మండల కేంద్రంలో  టీఆర్​ఎస్​కు 613 ఓట్ల లీడ్ వచ్చింది.

ఇదీ పరిస్థితి

  •     మంత్రి మల్లారెడ్డి ఇన్​చార్జ్​గా ఉన్న  చౌటుప్పల్ మండలం ఆరె గూడెం, కాట్రేవు, రెడ్డిబావి గ్రామాల్లో టీఆర్ఎస్ కంటే బీజేపీకి 450 ఓట్ల ఆధిక్యం వచ్చింది.  టీఆర్ఎస్​కు1015 ఓట్లు పోల్​కాగా..  బీజేపీకి 1,466 ఓట్లు పడ్డాయి. 
  •     మంత్రి జగదీశ్​రెడ్డి ఇన్​చార్జ్​గా ఉన్న మునుగోడు టౌన్​లో టీఆర్ఎస్ కు 2,614 రాగా..  బీజేపీకి 2,676 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీ 62 ఓట్ల మెజార్టీ సాధించింది. 
  •     మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇన్​చార్జ్​గా ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం, తాళ్ల సిం గారం, కొత్తపేట గ్రామాల్లో బీజేపీకి 1,227 ఓట్లు పోల్​కాగా, టీఆర్ఎస్   1,050 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీకి 177 ఓట్ల మెజార్టీ వచ్చింది.   
  •     మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇన్​చార్జ్​గా ఉన్న దేవలమ్మ నాగారంలో  టీఆర్ఎస్ కంటే బీజేపీకి 60 ఓట్లు ఎక్కువొచ్చాయి. 
  •     మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఇన్​చార్జ్​గా ఉన్న చండూరు మున్సిపాలిటీలో బీజేపీ 79 ఓట్ల మెజార్టీ సాధించింది.  
  •     మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇన్​చార్జ్​గా ఉన్న  సర్వేల్‌ ఎంపీటీసీ -1లో  టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీకి 18 ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. 
  •     మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్​చార్జ్​గా ఉన్న నాంపల్లి మండల కేంద్రంలో బీజేపీకి 497 ఓట్ల మెజార్టీ వచ్చింది. 

పలివెలలో బీజేపీకి భారీ ఆధిక్యం..

మునుగోడు మండలం పలివెల గ్రామంలో బీజేపీ భారీ ఆధిక్యం సాధించింది. ఈ గ్రామ ఎంపీటీసీ స్థానానికి రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​రెడ్డిని ఇన్​చార్జ్​గా టీఆర్​ఎస్​ నియమించింది. ఈ గ్రామం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్తగారి ఊరు కావడంతో మొదటి నుంచీ ఈ స్థానంపై ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరు నేతలు ఎలాగైనా తమ సత్తా చాటుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఇరువర్గాల మధ్య ఒక దశలో ఘర్షణ వాతావరణం కనిపించింది. ఈ గ్రామంలో 2,104 ఓట్లు ఉండగా.. 1,952 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో బీజేపీకి 1,029 రాగా, టీఆర్ఎస్ 698 ఓట్లతో సరిపెట్టుకుంది.  కాంగ్రెస్​ 101 ఓట్లకే పరిమితమైంది. మొత్తంమీద బీజేపీ 331 ఓట్ల మెజార్టీ సాధించింది.