యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన కలకలం రేపింది. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆదేశాలతో డ్రగ్స్ అక్రమ రవాణాపై యాదాద్రి- భువనగిరి పోలీసుల భారీ ఆపరేషన్ చేశారు. బీబీనగర్ పోలీసులు, ఎస్ఓటీ సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో.. రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. 40 కిలోల అసిటోన్ లిక్విడ్, ఫార్చ్యూనర్ కారు సీజ్ చేశారు. కొండమడుగు శివారులో వాహన తనిఖీల్లో ఈ డ్రగ్స్ పట్టుకున్నారు.
నాగ్‌పూర్‌కు డ్రగ్స్ తరలించే ప్రయత్నంలో పోలీసులు ఈ డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. కొండమడుగు వేటుకూరి ల్యాబ్స్‌లో డ్రగ్ తయారీకి వినియోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ సహా పలు పరికరాలు సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
►ALSO READ | గన్మెన్ల అంశంపై రాజకీయం తగదు.. మావోయిస్టుల సమస్య తగ్గినందుకే భద్రత తగ్గించాం:డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ చుట్టుముట్టు నల్ల మందు సప్లయ్ చేస్తున్న ముఠాలపై కూడా ఈగల్ ఫోర్స్ ఫోకస్ పెట్టింది. రాజస్తాన్ నుంచి మెఫిడ్రిన్, ఓపియం (నల్లమందు) సప్లయ్ చేస్తున్న ముఠాలపై ఉక్కు పాదం మోపింది. హైవేలపై ఉన్న రాజస్తాన్ దాబాలను కేంద్రంగా చేసుకుని నల్లమందు, మెఫిడ్రిన్ సప్లయ్ చేస్తున్న రాజస్తాన్‌కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను ఇప్పటికే అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద 25 గ్రాముల మెఫిడ్రిన్ (ఎండీ), 1.031 కిలోల నల్లమందు స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం మియాపూర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 20 రోజులుగా నిఘా పెట్టింది. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాల విలువ రూ.12.65లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
