ఎల్కతుర్తి, వెలుగు: కల్లు తాగేందుకు వచ్చిన ఓ యువకుడు వేట కొడవలితో దాడి చేసి గీత కార్మికుడిని హత్య చేశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గురువారం జరిగింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తికి చెందిన గొడిశాల మహిపాల్ అలియాస్ విజయ్‌కుమార్ (36) గీత వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన ఆకినేపల్లి అఖిల్ గోపాల్‌పూర్‌లో ఎన్పీడీసీఎల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఎల్కతుర్తిలో విజయ్‌కుమార్ ఇంటి పక్కనే ఉంటున్నాడు. గురువారం ఉదయం తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లిన విజయ్‌కుమార్ వద్దకు అఖిల్ వచ్చాడు.
కల్లు తాగే సమయంలో ‘నా భార్యతో ఎందుకు మాట్లాడుతున్నావ్ ? ఆమెతో నీకు ఏం సంబంధం..?’ అంటూ వేటకొడవలితో విజయ్‌పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన స్థానికులను సైతం కత్తితో బెదిరించాడు. అనంతరం కత్తిని అక్కడే పడేసి బైక్‌పై పారిపోయాడు. స్థానికులు 108, పోలీసులకు సమాచారం ఇవ్వగా... వారు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన విజయ్‌కుమార్‌ను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య శ్వేత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
