కోదాడ, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడి చేతులు కట్టేసి, గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బల్గూరి గణేశ్ (25) బెంగుళూరులో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి నెల రోజుల కింద స్వగ్రామానికి వచ్చాడు. గురువారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న గుడి వద్దకు వెళ్లాడు. తర్వాత ఇంటికి వెళ్లిన గణేశ్.. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ గుడి వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
రాత్రి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ఉదయం చుట్టుపక్కల వెదికారు. శుక్రవారం మధ్యాహ్నం బీక్యాతండా వెళ్లే రోడ్డులోని పొలాల్లో గణేశ్ డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా.. గణేశ్ చేతులు కట్టేసి, గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ నరసింహ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి గ్రామానికి చేరుకొని ఘటన వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.
