తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీ రోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పరాశక్తి'. బాక్సీఫీస్ వద్ద ఈ సంక్రాంతికి పోరులో నిలిచింది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. దళపతి విజయ్ నటించిన 'జననాయగన్ ' చిత్రానికి ఒక్క రోజు వ్యవధిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో అభిమానుల మధ్య వార్ మొదలైంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాకు థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.
తెలుగు వర్షన్ కు బ్రేక్..?
వాస్తవానికి ఈ నెల 10న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కావాల్సి ఉంది. సుధా కొంగర దర్శ కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళనాడులో జరిగిన హిందీవ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలరు భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను మొదట తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించారు. టీజర్, సాంగ్స్ కూడా తెలుగులో రిలీజ్ చేశారు. 'అమరన్ ' హిట్ తర్వాత వస్తున్న శివకార్తి కేయన్ సినిమా కావడంతో తెలుగులోను ఈ సినిమాకు నుంచి బజ్ ఉంది.
థియేటర్ల కొరతే కారణమా?
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం, తెలుగు డబ్బింగ్ వర్షన్ విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. తెలుగులో 'మన శంకరవరప్రసాద్', 'రాజాసాబ్', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'వారి వారి నడుమ మురారీ' వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలకే థియేటర్స్ ఎక్కువ కేటాయించబోతున్నారు. దానికి తోడు విజయ్ 'జననాయగన్' ను తెలుగులో పీవీఆర్ ఐనాక్స్ రిలీజ్ చేస్తుంది. సో మల్టీప్లెక్స్ లో ఎక్కువ షోన్ విజయ్ సినిమాకు వెళ్తున్నాయి. దాంతో అటు సింగిల్ స్క్రీన్స్, ఇటు మల్టిప్లెక్స్ లో 'పరాశక్తి'కి థియేటర్స్ దొరకడంలేదు. దీంతో పరాశక్తి తెలుగు వెర్షన్ ను జనవరి 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
విజయ్ 'జననాయగన్' కోర్టు కష్టాలు.. !
మరో వైపు విజయ్ 'జననాయగన్' మూవీకి సెన్సార్ గండం వెంటాడుతోంది. CBFC ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విజయ్ చివరి సినిమాకు విడుదల కష్టాలు తప్పడం లేదు. సెన్సార్డ్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని మద్రాస్ హైకోర్టులో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వాదించింది. ఈ సినిమా మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, సాయుధ దళాలను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించిందని ఆరోపిస్తూ నిర్మాతలకు సెన్సార్ బోర్డ్ నుంచి ఫిర్యాదు అందింది. సర్టిఫికేషన్ ప్రక్రియ ముగిశాక ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడిందని.. తక్షణమే సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని సెన్సార్ బోర్డ్ను ఆదేశించాలని జననాయగన్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఇరు పక్షాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. జనవరి 9న ఉదయం తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.
